హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని సీఎం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. వాస్తవానికి ఇప్పటివరకు కొన్నది కేవలం 24 శాతమేనని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 25 నుంచి బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు ఘోష.. బీజేపీ భరోసా’ యాత్రను చేపట్టనున్నట్టు ప్రకటించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ధాన్యం కొనుగోళ్లు నిజమైతే.. ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తామన్నారు.
లేదంటే.. తాము తీసుకెళ్లిన చోటుకు సీఎం రావాలని సవాల్ విసిరారు. కేంద్రాల్లో రైతులు పడుతున్న గోస, లారీలు లేక, గన్నీ బ్యాగులు దొరక్క రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను సీఎంకు చూపిస్తామని తెలిపారు. ప్రతి బస్తాకు 4 కిలోల చొప్పున అదనంగా కోత విధిస్తూ దోపి డీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో 10 శాతం ధాన్యం ఇలా మిల్లర్లు, దళారుల చేతుల్లోకి వెళ్తోందని, ఈ వేల కోట్ల రూపాయల దందా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
25 నుంచి క్షేత్రస్థాయిలో బీజేపీ పర్యటన..
ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పర్యటిస్తారని మహేశ్వర్ రెడ్డి వివరించారు. తొలిరోజు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచం దర్ రావు నేతృత్వంలో పర్యటన కొనసాగుతుందన్నారు.
