- సర్కార్ మాటిచ్చి నాలుగేండ్లు
- ఉమెన్స్‌డే రోజు ప్రొసిడింగ్స్ఇచ్చినా ఇప్పటికీ అతీగతీ లేదు
- నయా పైసా పడకపోవడంతో మహిళల ఆవేదన
యాదాద్రి, వెలుగు : మహిళా సంఘాలకు ఇస్తానన్న వడ్డీ(మిత్తి) రాయితీపై సర్కారు మాట తప్పింది. మహిళా దినోత్సవం రోజు ప్రొసిడింగ్స్ ఇచ్చినా ఇప్పటికీ జమ చేయలేదు. ఓట్ల కోసం ఎన్నికల టైమ్‌కే సంఘాల ఖాతాల్లో జమ చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేట్ లెవల్లో సుమారు 4,39,534 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 47,73,745 మంది సభ్యులుగా ఉన్నారు. ఆయా సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నాయి. తీసుకున్న రుణాలను సక్రమంగా కట్టిన సంఘాలకు వడ్డీ లేని రుణాల స్కీంలో రీయింబర్స్మెంట్ద్వారా జమ చేస్తుంది. అయితే సదరు వడ్డీ(మిత్తి) రాయితీని మూడు నెలలకు ఒకసారి ఖాతాల్లో జమ చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో కాస్తా అటు ఇటుగా మిత్తి జమ చేసేవారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంఘాలకు మిత్తి పైసలు జమ చేయలేదు. చివరకు 2018 ఎన్నికల ముందు నాలుగేండ్ల మిత్తిని ఒకేసారి జమ చేసింది. ఇక నుంచి రెగ్యులర్‌గా మిత్తి వేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే మళ్లీ అధికారంలోకి రాగానే 2018 నుంచి 2023 వరకూ సంఘాలకు మిత్తి ఊసే ఎత్తలేదు.
నయా పైసా జమకాలె..
2023 ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టగానే.. బీఆర్ఎస్ సర్కారుకు గతంలో మాదిరిగానే మహిళా సంఘాల మిత్తి గుర్తుకు వచ్చింది. 2018 –19 ఫైనాన్స్ ఇయర్‌కు నాలుగు నెలలు, 2019–-20 ఫైనాన్స్ ఇయర్‌కు సంబంధించి స్టేట్ లెవల్లో రూ.650 కోట్ల వడ్డీ లేని రుణాలు (వీఎల్ఆర్) విడుదల చేస్తున్నామని ప్రకటించింది. వరల్డ్ ఉమెన్స్ డే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మహిళా సంఘాలకు ప్రొసిడింగ్స్ ఇచ్చారు. వాటిని ఇచ్చి మూడు నెలలు కావొస్తోంది. ఇప్పటి వరకూ మహిళా సంఘాల ఖాతాల్లో నయా పైసా జమ కాలేదు.
డిసెంబర్లోనేనా..?
2018 ముందస్తు ఎన్నికలకు నెల ముందే.. నాలుగేండ్ల మిత్తిని మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేసింది. వడ్డీ మొత్తం ఒకేసారి అకౌంట్లలో జమ చేయడం ద్వారా మహిళల ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేయించుకోవాలనే ఉద్దేశమే తప్ప.. పథకం అమలులో చిత్తశుద్ధి లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఐదేండ్లుగా మిత్తి చెల్లించకపోవడంపై ఏమిటని మహిళలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జారీ చేసిన ప్రొసిడింగ్స్మేరకు వడ్డీ రాయితీని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
తొందర్లోనే జమ..
మహిళా సంఘాలకు వడ్డీకి సంబంధించిన ప్రొసిడింగ్స్ఇచ్చాం. వివిధ కారణాలతో సంఘాల ఖాతాల్లో వడ్డీ పైసలు జమ కాలేదు. త్వరలోనే జమ అవుతాయి.
–నాగిరెడ్డి, డీఆర్డీవో (ఇన్చార్జి), యాదాద్రి

