సిద్దిపేట, వెలుగు : సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం ఆరెపల్లి వేంకటేశ్వరాలయం వద్ద అరుదైన మహిషాసురమర్దిని శిల్పం బయటపడింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తో పాటు సిద్దిపేటకు చెందిన బృందం సభ్యులు 18 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు, 2 సెంటీ మీటర్ల లావు ఉన్న ఈ శిల్పాన్ని గుర్తించారు. ఇది బాదామి చాళుక్యుల కాలమైన క్రీ.శ.7వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు.
గతంలో విష్ణుకుండినుల కాలానికి (5వ శతాబ్ది) మహిషాసురమర్దిని శిల్పం కీసరగుట్టలో దొరకగా..ఇటీవల నల్లగొండ జిల్లా పానగల్లులో అదే కాలానికి చెందిన మహిషాసురమర్దిని చిన్న శిల్పాన్ని గుర్తించారు. ఆరెపల్లిలో వెలుగుచూసిన ఈ శిల్పం బాదామీలోని శిల్పం కంటే ముందుది. తర్వాత కాలంలో పెద్ద పరిమాణంలో అమ్మవారి శిల్పాలు ఆలంపురం వంటి క్షేత్రాల్లో బయటపడ్డాయని రామోజు హరగోపాల్ తెలిపారు. వేంకటేశ్వరాలయం ముందున్న రాష్ట్రకూటుల శైలి జైన చౌముఖిని కూడా బృందం పరిశీలించింది. కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీర్, ఈమని శివనాగిరెడ్డి, ఎస్.జైకిషన్, ఎండీ నసీర్ పాల్గొన్నారు.
