జంట మహిళల హత్య కేసులో నిందితురాలు మృతి

జంట మహిళల హత్య కేసులో నిందితురాలు మృతి
  • పోలీస్ స్టేషన్ బాత్‌‌రూంలో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం
  • నిమ్స్​లో చికిత్స పొందుతూ మృతి

చేవెళ్ల/తాండూరు, వెలుగు:  వికారాబాద్​ జిల్లా తాండూరు ప్రాంతంలో ఇద్దరు మహిళల హత్య కేసులో ప్రధాన నిందితురాలైన కరీమా బేగం (42) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. తనకు అప్పులు ఇచ్చి తిరిగి అడిగినందుకే బషీరాబాద్​ మండలం కాశీంపూర్​కు చెందిన అబేదాబేగం (60), తాండూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబా బేగం (65)ను దారుణంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాలను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌‌ మండలం తోల్కట్టలోని ఓ ఫాంహౌస్ వద్ద పాతిపెట్టిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన తాండూరు పోలీసులు.. గత నెల 17న కరీమాబేగంతో పాటు ఆమె భర్త రెహమన్​, తోల్కట్టకు చెందిన నయీమ్​ను అరెస్ట్​ చేశారు. నిందితులను తోల్కట్టకు తీసుకొచ్చి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం నిందితులను కరణ్‌‌కోట్ పోలీస్టేషన్‌‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌‌లో ప్రధాన నిందితురాలు కరీమాబేగం అర్ధరాత్రి బాత్‌‌రూంలోకి వెళ్లి యాసిడ్ తాగింది.

పోలీసులు వెంటనే ఆమెను హైదరాబాద్‌‌లోని నిమ్స్​ కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్​ మెజిస్ర్టేట్​ ముందు హాజరుపర్చి నిందితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. అనంతరం తిరిగి నిమ్స్​లోనే చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆమె మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం 
నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.