మక్క రైతుకు తిప్పలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిండిపోయిన గోదాంలు

మక్క రైతుకు తిప్పలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిండిపోయిన గోదాంలు
  •  భూపాలపల్లి నుంచి, కరీంనగర్, సిద్దిపేట గోదాంలకు తరలింపు
  •  దిగుమతి ఆలస్యంతో అదనంగా వెయిటింగ్ చార్జీలు 

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు:  యాసంగిలో మక్కలు సాగు చేసిన రైతులు పంట విక్రయించేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. బారదాన్​ కొనుగోలు నుంచి కాంటా హమాలీ, రవాణా ఖర్చుల వరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ముందుగానే వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో మక్కల నిల్వలకు సరిపడా గోదాములు లేకపోవడంతో ఆఫీసర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వ గోదాములు, అద్దె గోదాములు నిండిపోవడంతో పక్క జిల్లాల గోదాములకు మక్కలను తరలిస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులతో పాటు క్వింటాల్​కు రూ.100 వరకు వెయిటింగ్​చార్జీల భారం కూడా రైతులపైనే పడుతోంది. ప్రైవేట్​ గోదాములను అద్దెకు తీసుకుని మక్కలను నిల్వ చేసేందుకు మార్క్​ఫెడ్​, మార్కెటింగ్​ ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. 

అంచనాకు మించి దిగుబడి..

జిల్లాలో యాసంగిలో సాగు చేసిన మక్కజొన్న దిగుబడి అంచనాలకు మించి రావడంతో నిల్వ సమస్య తీవ్రమైంది. పక్క జిల్లాల గోదాములకు తరలించాల్సి రావడంతో అక్కడ దిగుమతికి రెండు రోజుల టైం పడుతోంది. దీంతో వాహనదారులకు చెల్లించాల్సిన వెయిటింగ్​ ఛార్జీలు కూడా రైతులే భరిస్తున్నారు. జిల్లాలో 49,527 ఎకరాల్లో మక్కజొన్న సాగు చేయగా, 1.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు.

మార్క్ ఫైడ్ ఆధ్వర్యంలో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎకరాకు 26.50 క్వింటాళ్ల చొప్పున మొత్తం 45,502 మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మే మూడో వారం నాటికి 6,599 మంది రైతుల నుంచి రూ.12.39 కోట్ల విలువైన 35,361.500 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేశారు. 30,260.150 మెట్రిక్ టన్నులను గోదాములకు తరలించగా, ఇంకా 5,101.350 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉన్నాయి. వాటిని తరలించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు.   

పక్క జిల్లాలకు తరలింపు.. 

భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలోని ఏఎంసీ గోదాంలు, ప్రైవేట్ కాటన్ మిల్లుల్లు ఇప్పటికే నిండిపోయాయి. రేగొండ మండలం లింగాలలోని లక్ష్మీ బన్ని రైస్ మిల్, చిట్యాల బాలమురగన్ జిన్నింగ్ మిల్, పీఏసీఎస్ గోదాంలు, మహదేవపూర్ ఏఎంసీ గోదాంలు కూడా సరిపోకపోవడంతో కరీంనగర్ జిల్లా చెంగర్ల, జమ్మికుంట, ఉప్పల్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల గోదాములకు మక్కలను తరలిస్తున్నారు.

ఉప్పల్, జమ్మికుంట గోదాంలు కూడా నిండిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మొగుళ్లపల్లి మండలానికి చెందిన రైతులు మొదట జమ్మికుంట గోదాంకు వెళ్లగా అక్కడ ఖాళీ లేకపోవడంతో ఉప్పల్ కు, అక్కడ కూడా స్థలం లేకపోవడంతో చివరకు చిట్యాల ఏఎంసీ గోదాంకు మక్కలను తీసుకువచ్చినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మక్కలు లోడ్ చేసే సమయంలో ఒక్కో బస్తాకు రూ.25 వరకు రవాణా, దిగుమతి ఖర్చుల పేరుతో వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్క ఎకరం మక్క పంటను అమ్ముకునేందుకు దాదాపు రూ.10 వేల ఖర్చవుతోందని వాపోతున్నారు. 

సగం కూడా కొనని మార్క్​ఫెడ్..

గతేడాది మక్కలు కొనుగోళ్లకు దూరంగా ఉన్న మార్క్​ఫెడ్, ఈ సారి కూడా రైతులు పండించిన పంటలో సగం కూడా కొనుగోలు చేయలేదని రైతులు విమర్శిస్తున్నారు. 1.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి అంచనా ఉండగా, కేవలం 45 వేల మెట్రిక్ టన్నలు కొనుగోలుకే టార్గెట్ పెట్టుకున్నారు. మిగిలిన 85 వేల మెట్రిక్ టన్నుల మక్కలను రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆలస్యం, ఇబ్బందులతో విసిగిపోయిన రైతులు క్వింటాల్​కు రూ.500 వరకు తక్కువ ధరకు ప్రైవేట్​ వ్యాపారులకు పంటను విక్రయించినట్లు తెలిపారు.

టార్గెట్ మేరకు కొనుగోళ్లు.. 

టార్గెట్ మేరకు రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 40 వేల మెట్రిక్ టన్నుల మక్కలను సేకరించాం. మరో 5 వేల మెట్రిక్ టన్నులు మూడు రోజుల్లో పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించాం. రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో ప్రైవేట్ గోదాంను అద్దెకు తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నాం. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపడుతున్నాం.  - శ్రీదేవి, మార్క్ ఫెడ్ డీఎం, భూపాలపల్లి