హైదరాబాద్ సిటీ నడిబొడ్డు అమీర్ పేట్ మెయిన్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రీవనం సమీపంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న KSR ఫ్యాషన్స్ అనే బట్టల దుకాణం ఉన్న బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగలబడిపోతుంది. భగభగ మండే మంటలతో దగ్గరకు వెళ్లటానికి సైతం సాహసించలేకపోతున్నారు స్థానికులు. బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోతున్న విజువల్స్ చుట్టు పక్కల వాళ్లను భయాందోళనలకు గురి చేస్తుంది.
మూడు అంతస్తుల ఈ బిల్డింగ్ మొత్తం కాలిబూడిద అవుతుంది. ఈ బిల్డింగ్ చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాపులు ఇలా చాలా షాపులు ఉన్నాయి. మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు వ్యాపిస్తున్నాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అందరూ వారి వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు.
విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. KSR ఫ్యాషన్స్ షాపులో అన్నీ దుస్తులు కావటంతో మంటల స్థాయిలో తీవ్రంగా ఉందంటున్నారు అధికారులు.
