మాలలకు న్యాయం చేయాలి..మంత్రి సీతక్కకు మాల సంఘాల జేఏసీ వినతి

మాలలకు న్యాయం చేయాలి..మంత్రి సీతక్కకు మాల సంఘాల జేఏసీ వినతి
  • సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ వల్ల రాష్ట్రంలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని మాల సంఘాల జేఏసీ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ నేతృత్వంలో జేఏసీ ప్రతినిధులు మంత్రి సీతక్కని కలిసి మాలలకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీలలోని మాల, మాల అనుబంధ కులాలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని గణాంకాలతో మంత్రికి వివరించారు.

అనంతరం మందాల భాస్కర్, బేర బాలకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణలోని 30 లక్షల మందికిపైగా ఉన్న మాల సమాజం అనాదిగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆగ మేఘాల మీద ఎస్సీ వర్గీకరణ చేసి మాల అనుబంధ కులాలైన 26 కులాలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా సీఎం దృష్టి సారించి మాల అనుబంధ 26 ఉప కులాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఎస్సీ వర్గీకరణ వల్ల రాష్ట్రంలో మాల కులస్తులకు అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారని వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో విద్యార్థి జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్, కే బాలకృష్ణ, సఖి గంగాధర్, బత్తుల రమేశ్, దిలీప్, అనీష్ పాల్గొన్నారు.