- మాలలకు న్యాయం జరిగేలా సవరణలు చేయాలని విజ్ఞప్తి
బషీర్‌బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో మాల, దాని ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ సబ్‌కమిటీ మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, సీతక్కను సోమవారం సచివాలయంలో ఆయన కలిసి ఈ అంశంపై వివరించారు. ఎస్సీ వర్గీకరణ అమలులో రోస్టర్ పాయింట్ల వల్ల మాల సామాజికవర్గానికి అన్యాయం జరుగుతోందని సబ్‌కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
వర్గీకరణ అనంతరం మాలలకు కేటాయించిన రిజర్వేషన్లు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, ఉద్యోగాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ అవకాశాల్లో పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రోస్టర్ విధానాన్ని సమగ్రంగా పరిశీలించి.. మాలలకు న్యాయం జరిగేలా అవసరమైన సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ వల్ల ఏ సామాజిక వర్గానికీ అన్యాయం జరగకూడదని చెప్పారు. ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి దక్కాల్సిన రిజర్వేషన్ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా సబ్‌కమిటీ చర్యలు తీసుకోవాలన్నారు. రోస్టర్ పాయింట్ల సవరణతోపాటు రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
