ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం

మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చిన ఆయనను స్థానికులు నిలదీశారు. మౌలాలిలోని ఆర్టీసీ కాలనీ వద్ద మెయిన్ రోడ్డు పూర్తిగా పాడైంది. కొన్ని నెలలుగా పెద్ద పెద్ద గుంతలతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి రిపేర్లు చేయడం లేదు. 

స్థానికులు ఇటీవల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్​నేత మైనంపల్లి హనుమంతరావును కలిసి రోడ్డు బాగుచేయాలని కోరారు. ఆయన చొరవతో ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుతున్నాయి. గురువారం వాటిని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రోడ్డును బాగు చేయాలని ఎన్నో నెలలుగా వేడుకుంటున్నామని, అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదని మండిపడ్డారు. 

ధర్నాలు, నిరసనలు చేపట్టినా పట్టించుకోలేదని వాపోయారు. మాజీ ఎమ్మెల్యే చొరవతో జరుగుతున్న రోడ్డు పనులను పర్యవేక్షించడానికి ఎలా వస్తారని నిలదీశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పి పంపించారు. ఎమ్మెల్యే రాజశేఖర్​రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కాలనీ రోడ్డు గుండా తాను అనేక సార్లు ప్రయాణించానని, ఇక్కడ పరిస్థితిపై అవగాహన ఉందని చెప్పారు. అధికారులతో రోడ్డు నిర్మాణ విషయమై చర్చించానని తెలిపారు.