- రూల్స్ పాటించని 46 సెంటర్లపై కేసులు
మల్కాజిగిరి/ఎల్బీనగర్, వెలుగు: స్పా సెంటర్లకు భవనాలను అద్దెకిచ్చే యజమానులు అద్దెదారుల వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని మల్కాజిగిరి సీపీ సుమతి సూచించారు. అక్రమ కార్యకలాపాలకు సహకరిస్తే బిల్డింగ్ల ఓనర్లపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్బీనగర్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. శుక్రవారం 113 స్పా సెంటర్లపై దాడులు చేసి, రూల్స్పాటించని 46 కేంద్రాలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో అనేక స్పా కేంద్రాలు సరైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. కొన్ని వినియోగదారుల గుర్తింపు పత్రాలు తీసుకోకపోవడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, బోర్డులు లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఎల్బీనగర్ జోన్‌లో 47 సెంటర్లలో తనిఖీలు చేపట్టి, 17 కేసులు, ఉప్పల్ జోన్‌లో 30 కేంద్రాల్లో తనిఖీలు చేసి, 11 కేసులు, మల్కాజిగిరి డివిజన్-–1లోని 17 సెంటర్లలో తనిఖీలు చేపట్టి, 7 కేసులు, కంటోన్మెంట్ డివిజన్-–2లో 19 కేంద్రాలపై దాడి చేసి, 11 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అనధికారికంగా నడుస్తున్న స్పా సెంటర్ల సమాచారాన్ని సమీప పోలీస్ స్టేషన్ లేదా కమిషనరేట్ హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని ప్రజలను కోరారు. డీసీపీ మనోహర్, ఇతర అధికారులు ఉన్నారు.
