హైదరాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్పాలనలో తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్, కేటీఆర్ మాత్రమేనని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. గురువారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మల్లు రవి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల ఇప్పుడు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఏర్పడిందన్నారు.
రేవంత్ రెడ్డి పాలనలో జనం స్వేచ్ఛగా ఉన్నారని, ప్రజా పాలనతో సీఎం నిత్యం జనాలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ అని గతంలో కేసీఆర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలని సూచించారు.
