వెస్ట్ బెంగాల్ లో పోలింగ్ రోజు ఎంత టెన్షన్ ఉన్నదో.. రిజల్ట్స్ వచ్చే వరకు అలాంటి వాతావరణమే ఉండేలా కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య రాజుకున్న రాజకీయ యుద్ధ వాతావరణం.. రాత్రుల్లో కూడా గల్లీల్లో గస్తీ కాసే వరకు వచ్చింది. 2025 ఏప్రిల్ 30 (గురువారం) అర్ధరాత్రి సీఎం మమతా బెనర్జీ స్ట్రాంగ్ రూమ్ ముందు ధర్నాకు దిగటం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
ఎన్నికల సంఘం అధికారుల సహాయంతో బీజేపీ ఈవీఎంలను ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. నాయకులు, కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అందరూ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కాపాలా కాయాలని పిలుపునిచ్చారు. తాను కూడా కాపలా కాయనున్నట్లు చెప్పిన సీఎం.. భవానీ నగర్ లో నియోజకవర్గంలో సఖావత్ మెమోరియల్ హై స్కూల్ లో ఉన్న స్ట్రాంగ్ దగ్గరికి వెళ్లారు. ఒకవైపు బీజేపీ, మరోవైపు టీఎంసీ మద్ధతుదారులతో స్ట్రాంగ్ ముందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
మరోవైపు టీఎంసీ అభ్యర్థులు కునాల్ ఘోష్, శశి పంజా.. పార్టీ వర్కర్స్ తో కలిసి నేతాజీ ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్న ఖుదిరామ్ అనుశీలన్ కేంద్రం దగ్గర ధర్నా నిర్వహించారు. ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారని ఆందోళన నిర్వహించారు. అదేదసమయంలో అక్కడికి బీజేపీ కార్యకర్తలు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
- ఎన్నికల సంఘంపై దీదీ తీవ్ర విమర్శలు:
బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఈవీఎం లను ట్యాంపరింగ్ చేస్తున్నాయని మమతాబెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ కోసం ఈసీ పనిచేస్తుందని ఆరోపించారు. ఇతర పార్టీ ప్రతినిధులు ఎవరూ లేకుండానే బ్యాలట్ బాక్సులను తెరిచేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్న స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న బ్యాలెట్ బాక్సులను పగలగొట్టడానికి బీజేపీ ప్రయత్నించింది. ప్రజాసామ్యాన్ని ఖూనీ చేయడానికి జరిగిన ప్రయత్నమిది. ఎన్నికల సంఘం నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తృణమూల్ పార్టీ ఎక్స్ లో వీడియోలతో కూడిన ట్వీట్ చేసింది.
