పశ్చిమ బెంగాల్ లో అర్ధరాత్రి హైడ్రామా... ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయంటూ స్ట్రాంగ్ రూంలోకి వెళ్లిన మమత

పశ్చిమ బెంగాల్ లో అర్ధరాత్రి హైడ్రామా... ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయంటూ స్ట్రాంగ్ రూంలోకి వెళ్లిన మమత
  • 4 గంటలు అక్కడే గడిపిన సీఎం.. కార్యకర్తలతో కలిసి బైఠాయింపు
  • ప్రతిపక్ష బీజేపీ లీడర్ సువేందు తీవ్ర అభ్యంతరం
  • ఈవీఎంలపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ 

కోల్ కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి మూడు రోజుల ముందు కోల్ కతాలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. గురువారం రాత్రి లేట్ నైట్  ఈవీఎం డ్రామా జరిగింది. ఎలక్ట్రానిక్  ఓటింగ్  మెషీన్లను (ఈవీఎంలు) ట్యాంపర్  చేశారని ఆరోపిస్తూ బెంగాల్   సీఎం మమతా బెనర్జీ కోల్ కతాలోని భవానీపూర్  నియోజకవర్గ సెగ్మెంట్  పరిధిలో ఓ స్ట్రాంగ్ రూంలోకి వెళ్లారు. తన ఎన్నికల ఏజెంట్ తో కలిసి ఆమె స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. దాదాపు 4 గంటలు ఆమె అక్కడే ఉన్నారు. అర్ధరాత్రి 12.07 గంటలకు బయటకు వచ్చారు. 

ఈ సందర్భంగా మీడియాతో మమత మాట్లాడారు. కౌంటింగ్  ప్రక్రియలో ఎలాంటి ట్యాంపరింగ్, మాల్ ప్రాక్టీస్  జరగరాదని, అలా చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూంలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ఓటింగ్  ప్రక్రియ సజావుగా జరిగేలా ఈసీ అధికారులు చూడాలని, పారదర్శకత పాటించాలని డిమాండ్  చేశారు. 

‘‘ప్రజల ఓట్లను గౌరవించాలి. మాల్ ప్రాక్టీస్, ట్యాంపరింగ్  వంటివి జరుగుతున్నాయని నాకు సమాచారం వచ్చింది. అందుకే భవానీపూర్  సెగ్మెంట్  పరిధిలో ఒక స్ట్రాంగ్ రూంను పరిశీలించాను. కౌంటింగ్  ప్రక్రియను ట్యాంపర్  చేయాలని చూస్తే సహించేది లేదు” అని మమత వ్యాఖ్యానించారు. అనంతరం తన పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి బైఠాయించారు. ఆథరైజ్డ్  పార్టీ ప్రతినిధులు లేకుండానే బ్యాలట్  బాక్సులను తెరిచారని టీఎంసీ నేతలు ఆరోపించారు. కాగా.. భవానీపూర్  నియోజకవర్గం నుంచి మమత పోటీ చేశారు.

నేడు 15 బూత్‌‌‌‌లలో రీపోలింగ్ 

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం రెండు నియోజకవర్గాల్లోని 15 బూత్‌‌‌‌లలో పోలింగ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం (మే 2న) మగ్రాహత్ పశ్చిమ్ నియోజకవర్గంలో 11 బూత్‌‌‌‌లు, డైమండ్ హార్బర్‌‌‌‌లో 4 బూత్‌‌‌‌లలో రీ- పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 29న జరిగిన ఓటింగ్ చెల్లదని, ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు బెంగాల్ ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ స్పష్టం చేశారు. 

శనివారం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్​ఉంటుందని, గ్రామాల్లో చాటింపు వేయించి, అభ్యర్థులకు ముందే సమాచారం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. బెంగాల్‌‌‌‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరిగిన రెండు దశల పోలింగ్‌‌‌‌లో జనం భారీగా తరలివచ్చారు. ఏకంగా 92.47 శాతం ఓటింగ్ నమోదైంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర చరిత్రలో ఇదే పెద్ద రికార్డ్. అయితే, ఓటింగ్ ముగిసినా గొడవలు మాత్రం తగ్గడం లేదు. పోలింగ్ తర్వాత జరిగే హింసను ఆపడానికి ఎన్నికల సంఘం గట్టి ఏర్పాట్లు చేసింది. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌‌‌‌ల దగ్గర కూడా భద్రత పెంచారు.  

మమత ఆరోపణల్లో నిజం లేదు: ఈసీ

కౌంటింగ్  ప్రక్రియలో మాల్ ప్రాక్టీస్  జరిగే అవకాశం ఉందని, ఈవీఎంలను ట్యాంపర్  చేస్తారని సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్లో నిజం  లేదని బెంగాల్  ఎన్నికల సంఘం పేర్కొంది. స్ట్రాంగ్ రూంలన్నీ సురక్షితంగా ఉన్నాయని శుక్రవారం ఒక ప్రకటనలో ఈసీ  తెలిపింది. ‘‘చివరి స్ట్రాంగ్ రూంను శుక్రవారం ఉదయం 5.15 గంటలకు క్లోజ్  చేశాం. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూంలన్నింటికీ  సీల్  వేశాం” అని ఈసీ వెల్లడించింది.

మమతపై గట్టి నిఘా పెట్టాం: సువేందు

సీఎం మమతా బెనర్జీ స్ట్రాంగ్ రూంను పరిశీలించడంపై బీజేపీ లీడర్, భవానీపూర్  అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సువేందు అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. మమత ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఆమెపై గట్టి నిఘా పెట్టామని ‘ఎక్స్’ లో ఆయన పేర్కొన్నారు. మమత ప్రవేశించిన స్ట్రాంగ్‌‌‌‌ రూంలో తన ఎన్నికల ఏజెంట్  ఆమెపై నిఘా పెడుతున్నట్లు ఉన్న వీడియోను ఎక్స్ లో ఆయన షేర్  చేశారు. ‘‘అధికారం నుంచి దిగిపోతున్న (ఔట్ గోయింగ్  సీఎం) ముఖ్యమంత్రి ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 

ఈ విషయాన్ని నా నియోజకవర్గం భవానీపూర్ తో పాటు యావత్  బెంగాల్  ప్రజలకు తెలియజేస్తున్నా. ఆమె స్ట్రాంగ్ రూంలో ఉన్నంతసేపు నా ఎన్నికల ఏజెంట్  పర్సనల్ గా ఆమెపై ఒక కన్నేసి ఉంచారు. ఆమె ఎంత ప్రయత్నించినా.. రూల్స్ కు విరుద్ధంగా వెళ్లలేరు” అని సువేందు పేర్కొన్నారు. మమత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.