V6 News

అమ్మవారి విగ్రహం నేనే ఎత్కపోయిన..తాగి ఏం చేస్తున్ననో తెల్వలే.. పోలీసులకు దొంగ ఫోన్

 అమ్మవారి విగ్రహం నేనే ఎత్కపోయిన..తాగి ఏం చేస్తున్ననో తెల్వలే.. పోలీసులకు దొంగ ఫోన్

పద్మారావునగర్, వెలుగు: ఓ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఓ వ్యక్తి చోరీ చేసి తానే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బన్సీలాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట డివిజన్ పరిధిలోని ఐడీహెచ్ కాలనీ పార్థివాడలో కట్టమైసమ్మ, ఉప్పులమ్మ, అడవి మైసమ్మ కొలువై ఉన్న పురాతన ఆలయం ఉంది. సోమవారం ఉదయం భక్తులు దర్శనం కోసం వెళ్లగా అడవి మైసమ్మ విగ్రహం మాయమైంది. సుమారు 3 కిలోలకుపైగా వెండితో తయారైన ఈ విగ్రహం చోరీకి గురైనట్లు గుర్తించారు. 

చోరీకి పాల్పడిన వ్యక్తే పద్మారావునగర్ హమాలీ బస్తీ నుంచి 100కు కాల్ చేశాడు. తాను డ్రగ్స్ మత్తులో తప్పు చేశానని, ఏమి చేశానో అర్థం కావడం లేదని తెలిపాడు. వెంటనే అక్కడికి చేరుకున్న చిలకలగూడ పోలీసులు హమాలీబస్తీ చౌరస్తా వద్ద ఓ ఆటోలో మత్తులో ఉన్న వ్యక్తిని గుర్తించారు. అతడి దగ్గరి అమ్మవారి విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. నిందితుడిని అజీజ్ ఖాన్ అలియాస్ ఛోటా డాన్ గా గుర్తించారు. 

ఆలయ నిర్వాహకులకు విగ్రహాన్ని అప్పగించారు. విగ్రహం కొంత దెబ్బతినడంతో మరమ్మతులు చేసి పునఃప్రతిష్ఠ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించారు. పోలీసులకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. బీజేపీ నాయకుడు మర్రి పురూరవ రెడ్డి ఆలయాన్ని సందర్శించారు.