- మూడు రోజుల్లో రిపోర్ట్ వచ్చే ఛాన్స్
మంచిర్యాల,వెలుగు: మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో శిశువుల తారుమారు ఘటన మరో మలుపు తిరిగింది. మగబిడ్డ మావాడంటే..మావాడంటూ రెండు కుటుంబాలు గొడవకు దిగడంతో చివరకు అధికారులు డీఎన్ఏ టెస్టు ద్వారా తేల్చాలని నిర్ణయించారు. శుక్రవారం పిల్లలు, తల్లులు, తండ్రుల బ్లడ్‌శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బొల్లం పావని, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన దుర్గం మమతకు జీజీహెచ్ డాక్టర్లు గత మంగళవారం సిజేరియన్‌చేసి పురుడు పోశారు. ఒకరికి పాప, మరొకరికి బాబు పుట్టారు. నర్సులు నిర్లక్ష్యంతో పాప కుటుంబీకులకు బాబును, బాబు కుటుంబీకులకు పాపను ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత పొరపాటును గ్రహించి ఎవరి శిశువులను వారు తీసుకోవాలని చెప్పారు. దీనికి ఒప్పుకోని మమత కుటుంబీకులు మగబిడ్డ మావాడే అంటూ గొడవకు దిగారు. పొరపాటు జరిగిందని అధికారులు ఎంత సర్ధి చెప్పినా వినలేదు.
దీంతో హాస్పిటల్ అధికారులు శిశువులను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించి వారి పర్యవేక్షణలో ఎన్ఐసీయూలో ఉంచారు. ఇక చేసేది లేక శుక్రవారం శాంపిల్స్ తీసుకుని డీఎన్ఏ టెస్టు కోసం పంపారు. శాంపిల్స్ తారుమారు చేసే అవకాశం ఉందని పిల్లల తండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో వారిని కూడా అదే అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు పంపించారు. మూడు నాలుగు రోజుల్లో రిపోర్ట్ రానుందని, దాని ఆధారంగా ఎవరి శిశువును వారికి అప్పగిస్తామని జీజీహెచ్సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి చెప్పారు. ఈ ఘటనపై ఎంక్వయిరీ చేసి బాధ్యులైన సిబ్బందిపై యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.

