- అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ నిధులతో మారనున్న రూపురేఖలు
- పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవతో రూ. 26.49 కోట్లు మంజూరు
- లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఎలివేషన్లు, పార్కుల ఏర్పాటుతో ఎయిర్పోర్ట్ తరహా రూపు
కోల్‌బెల్ట్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా గుర్తింపు కలిగిన మంచిర్యాల రైల్వే స్టేషన్ కొత్తరూపు సంతరించుకుంటోంది. అమృత్ భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.26.49 కోట్లతో ప్రయాణికులకు మెరుగైన సౌలతులు కల్పించేందుకు పనులు చేపట్టింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో మంచిర్యాల రైల్వే స్టేషన్ రూపురేఖలే మారిపోనున్నాయి. ఉత్తర, దక్షిణ రైల్వే మార్గంలో కీలకంగా ఉన్న ఈ రైల్వే స్టేషన్ బయట, లోపల ప్రయాణికులకు అత్యాధునిక సౌలతులు అందుబాటులోకి రానున్నాయి. అమృత్ భారత్ స్కీమ్‌లో స్టేషన్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నారు.
అత్యాధునిక వసతులు..
అమృత్‌భారత్ స్కీమ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 500కు పైగా రైల్వే స్టేషన్లను ఎంపికయ్యాయి. ఇందులో రాష్ట్రంలో 15 స్టేషన్లు ఉండగా, మంచిర్యాలలో రూ.26.49 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టారు.2024 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పనులను ప్రారంభించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి స్టేషన్లలో చేపట్టిన పనులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొదట్లో పనుల్లో జాప్యం జరగడంతో ఎంపీ ఆఫీసర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. మంచిర్యాల రైల్వే స్టేషన్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో దానికి వెళ్లేందుకు 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ర్యాంప్‌లు నిర్మిస్తున్నారు. విశాలమైన వెయింటింగ్ హాల్స్, ఆధునిక టాయిలెట్లు, ఏసీ వెయింటింగ్ హాల్స్, రిఫ్రెష్మెంట్ రూమ్, లైటింగ్, లాకర్రూమ్లు, డ్రింకింగ్ వాటర్, ఏటీఎంలు, డిజిటల్ డిస్ప్లేలు, సీసీ కెమెరాలు, క్రమబద్ధమైన పార్కింగ్ ప్రాంతాలు వంటి సౌలతులు ఏర్పాటు చేస్తున్నారు. టూ, త్రీ, ఫోర్ వీల్స్ వెహికల్స్ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ షెడ్లు, స్టేషన్ ముందు వైపు పచ్చదనంతో ఆహ్లాదకరమైన ప్రవేశ ద్వారాలు, వాటికి అనుసంధానంగా పార్కింగ్ ఏరియా నిర్మాణ పనులు చేపట్టారు.
రెస్ట్హాల్స్నిర్మాణాలు, ఎస్కలేటర్‌కు సంబంధించిన పనులు పూర్తి కావచ్చాయి. కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, టికెట్ కేంద్రాలు, సర్క్యూలేటింగ్, పార్కింగ్, గార్డెన్ పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. మే30లోపు అభివృద్ది పనులన్నీ పూర్తి చేయాలని రైల్వే శాఖ ఆఫీసర్లు నిర్ణయించారు. మంగళ, బుధవారాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ గోపాలకృష్ణ వేర్వేరుగా రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రాండ్ లుక్..
దక్షిణ, ఉత్తర భారతంతో కలిపే కీలక మార్గంలో ఉన్న మంచిర్యాల రైల్వే స్టేషన్ మీదుగా ప్రతి రోజు హైదరాబాద్, ఢిల్లీ, మహారాష్ట్ర, చెన్నై, విజయవాడ వంటి అనేక ప్రాంతాలకు రైళ్లు ప్రయాణిస్తాయి. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, సింగరేణి, ఇతర కార్మికులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఇలా అన్నివర్గాల వారు పెద్ద సంఖ్యలో ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రతి రోజు ఈ స్టేషన్లో 62 రైళ్లు నిలుస్తాయి.5 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరి ద్వారా రైల్వే శాఖకు ప్రతి రోజు రూ.5.50 లక్షల ఆదాయం సమకూరుతోంది.
ప్రస్తుతం నాలుగు ఫ్లాట్‌ఫాంలు, మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, రెండు లిఫ్టులు, మూడు విశ్రాంతి గదులు అందుబాటులో ఉన్నాయి. అమృత్‌భారత్ స్కీమ్ ద్వారా ప్రయాణికుల సౌకర్యార్థం చేపడుతున్న పనులు పూర్తయితే మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆకట్టుకునే ఎలివేషన్‌తో ఎయిర్పోర్ట్ తరహా గ్రాండ్ లుక్‌ను సంతరించుకోనుంది.
పనులు స్పీడప్ చేయాలి
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్లలో కొత్త రైళ్ల హాల్టింగ్‌లు, స్టేషన్ల అభివృద్దిపై తరచూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి విన్నవిస్తున్నా. మంచిర్యాల, రామగుండం,పెద్దపల్లి రైల్వే స్టేషన్లు అమృత్‌భారత్ స్కీంలో చేర్చారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ది పనులు వేగవంతంగా పూర్తి చేయాలి. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు దూరం చేసి సురక్షిత, ఆధునిక సౌలతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం. పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, లైటింగ్, పార్కింగ్ తదితర అంశాలపై ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించాలి. మంచిర్యాలలో రెండు నెలల్లో అత్యాధునిక సౌలత్లు అందుబాటులోకి తీసుకవస్తం.
-పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

