V6 News

నియోజకవర్గానికో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్.! 

నియోజకవర్గానికో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్.! 
  • రాష్ట్రంలో ఇదివరకే 65 ఏటీసీలు ఏర్పాటు
  • తాజాగా మరో 46 మంజూరు చేసిన ప్రభుత్వం
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే ఐదు., 
  • కొత్తగా మరో ఏడు శాంక్షన్
  • స్థలాల ఎంపికలో నిమగ్నమైన లీడర్లు, ఆఫీసర్లు

హనుమకొండ, వెలుగు: పదో తరగతి పూర్తి చేసిన యువతకు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లను ఏర్పాటు చేస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీలను నెలకొల్పగా, తాజాగా మరో 46 సెంటర్ల ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏడు మంజూరయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లాల అధికారులు ఏటీసీల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, అన్ని ఏటీసీల్లో ఒకే రకమైన కోర్సులు కాకుండా కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటిని స్థానికంగా ఉండే ఇండస్ట్రీలకు అనుగుణమైన ట్రేడ్ లతో అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ఇంజినీరింగ్ కు దీటుగా ఏటీసీ ఎడ్యుకేషన్..

రాష్ట్రంలోని ఐటీఐలు అప్ గ్రేడ్ కు నోచుకోక కొన్నేండ్ల కిందటి 31 ట్రేడ్ లతోనే నడుస్తున్నాయి. కొన్నిచోట్ల వివిధ ట్రేడ్ లలో అడ్మిషన్లు లేక అవి కూడా క్లోజ్ అయ్యాయి. ప్రస్తుత టెక్నాలజీ, డిమాండ్ కు అనుగుణమైన కోర్సులు లేకపోవడం సమస్యగా మారగా, ఐటీఐలలోని సంప్రదాయ ట్రేడ్ లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఆరు అడ్వాన్స్డ్ కోర్సులతో ఏటీసీలను ఏర్పాటు చేస్తోంది. ఇంజినీరింగ్ కోర్సులకు దీటుగా అత్యాధునిక టెక్నాలజీతో రాష్ట్రంలో నియోజకవర్గానికొకటి చొప్పున ఏటీసీలను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది.

టాటా టెక్నాలజీస్ కంపెనీ సహకారంతో ఒక్కోదానిని రూ.45.15 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా రూ.5 వేల కోట్లతో 113 సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.  ఇందులో గతేడాదే 65 ఏటీసీలను ప్రారంభించింది. కొత్తగా మరో 46 ఏటీసీల ఏర్పాటుకు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. 

స్థానిక అవసరాలకు అనుగుణమైన కొత్త కోర్సులు

ప్రభుత్వం ఇప్పటివరకు ఏర్పాటు చేసిన ఏటీసీల్లో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషినింగ్ టెక్నిషియన్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్షరింగ్ టెక్నిషియన్, మాన్యుఫాక్షరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నిషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్, వర్చువల్ అనాలసిస్ అండ్ డిజైనర్ కోర్సులున్నాయి. వీటన్నింటిలో కలిపి 172 సీట్లున్నాయి.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెంటర్లలో ఒకే రకమైన కోర్సులుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఒకే రకమైన కోర్సులు కాకుండా స్థానిక వనరులు, పరిస్థితులు, ఇండస్ట్రీలను పరిగణనలోకి తీసుకుని ఏటీసీల్లో కొత్త ట్రేడ్ లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నియోజకవర్గాల్లో పరిస్థితులు, ఇండస్ట్రీలు, అవసరాలను స్టడీ చేసి, కొత్త కోర్సులను సజెస్ట్ చేసేందుకు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ 11 సభ్యులతో కమిటీ కూడా ఏర్పాటు చేశారు.

ఇందులో టాటా ఏరో స్పేస్, టాటా టెక్నాలజీస్, ఈసీఐఎల్, సైయెంట్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇడియన్ ఇండస్ట్రీ, క్రెడాయ్, లైఫ్ సైన్సెస్, శాన్వీ బయోజెన్ వంటి సంస్థల ప్రతినిధులను సభ్యులుగా అవకాశం కల్పించారు. ఈ కమిటీ సభ్యుల సిఫారస్ మేరకు కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఏటీసీల్లో అక్కడి అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు అందుబాటులోకి 
తీసుకురానున్నారు.

ఉమ్మడి జిల్లాలో మరో ఏడు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదట భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఏటీసీలు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత హనుమకొండ, వరంగల్, కాజీపేట ఏటీసీలను ములుగురోడ్డులోని ఐటీఐ కాంపౌండ్ లో నిర్మించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 5 ఏటీసీలు ఏర్పాటు కాగా, కొత్తగా మరో ఏడు శాంక్షన్ అయ్యాయి.

ఇందులో పరకాల, నర్సంపేట, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో ఒకటి చొప్పున, వర్ధన్నపేట నియోజకవర్గం కట్ర్యాల, జనగామ నియోజకవర్గం పసరమడ్ల, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం చిల్పూరు, డోర్నకల్ నియోజకవర్గం తానంచర్లలో ఏటీసీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఏటీసీల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, ఏటీసీల కన్వీనర్లు, ఇతర అధికారులు స్థలాలను పరిశీలించే పనిలో పడ్డారు. కొన్నిచోట్ల సరైన స్థలం దొరక ఇబ్బందులు ఎదురవుతుండగా, విద్యార్థుల రాకపోకలకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లోనే ఏటీసీలను నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

అందుబాటులోకి కొత్త కోర్సులు..

కొత్త ఏటీసీల్లో స్థానిక అవసరాలకు ఉపయోగపడేలా డిమాండ్ ఉన్న కోర్సులు అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో అగ్రికల్చర్, డ్రోన్స్, ఈవీ వెహికల్స్ తదితర రంగాల్లో కొత్త ట్రేడ్ లు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంజూరైన ఏటీసీల ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తున్నాం. ల్యాండ్ ఫైనల్ అయిన వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.- ఎం.చందర్, ఏటీసీ డిస్ట్రిక్ట్ కన్వీనర్, హనుమకొండ