V6 News

స్తంభించిన మక్క కొనుగోళ్లు..గన్నీ సంచులు లేక కాంటాలు ఆలస్యం

స్తంభించిన మక్క కొనుగోళ్లు..గన్నీ సంచులు లేక కాంటాలు ఆలస్యం
  • కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న పంట
  • టోకెన్​ సిస్టమ్ ​అమలు చేస్తున్న అధికారులు
  • పడిగాపులు కాయలేక వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటున్న రైతులు

మక్కలు అమ్ముకోవడం ప్రస్తుతం రైతుకు కత్తి మీద సాములా మారింది. కొనుగోలుకేంద్రాలకు మక్కలు పోటెత్తుతున్నా ఆ స్థాయిలో కొనుగోళ్లు జరగకపోవడంతో పంట మొత్తం యార్డుల్లోనే పేరుకుపోతోంది. సరిపడా గన్నీ సంచులు లేకపోవడంతో కాంటాలు ఆలస్యమవుతున్నాయి. మరోవైపు కాంటా వేసిన సంచులను తరలించేందుకు లారీలు సైతం అందుబాటులో లేకపోవడంతో కొనుగోళ్లు స్తంభించిపోతున్నాయి. దీంతో రోజులతరబడి మక్కలతో యార్డుల్లోనే గడుపుతున్న రైతులు.. వానొస్తే తమ పరిస్థితి ఏంటని బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.

తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన రైతు సాగర్ తనకున్న ఆరు ఎకరాల్లో  ఈసారి 132 క్వింటాళ్ల మక్కలు పండించాడు. సమీపంలోని తొగుట మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని, 12 రోజుల క్రితం సిద్దిపేట మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాడు. ఐదో రోజు జల్లి పట్టాలని అధికారులు చెప్పారు. ఆ తరువాత రెండు రోజులకు టోకెన్ ఇచ్చారు.

టోకెన్ ఇచ్చిన రెండు రోజుల తరువాత గన్నీ సంచులు ఇచ్చి తూకం వేశారు. లారీల సమస్య ఉందని చెప్పి తూకం వేసిన సంచులను పక్కన పెట్టేశారు.పంటను తీసుకొచ్చి 12 రోజులు గడిచినా కొనుగోలు ప్రక్రియ పూర్తికాకపోవడంతో రైతు సాగర్ యార్డులోనే పడిగాపులు పడుతున్నాడు. ఇది ఒక్క సాగర్ పరిస్థితి మాత్రమే కాదు., జిల్లాలో మక్కలు అమ్ముకోవడానికి వచ్చిన అనేక మంది ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు.

సిద్దిపేట, వెలుగు: యాసంగి సీజన్‌‌‌‌లో మక్క రైతులకు తిప్పలు తప్పడం లేదు. పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నా పట్టించుకునే వారు లేరని రైతులు వాపోతున్నారు. సిద్దిపేట జిల్లాలో ఈ సీజన్‌‌‌‌లో దాదాపు 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. అధికారుల అంచనా ప్రకారం సుమారు 15 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.

గత నెలలో మార్క్‌‌‌‌ఫెడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట, తొగుట, హుస్నాబాద్, గజ్వేల్, చిన్నకోడూరు, బెజ్జంకి, వడ్లూరు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్‌‌‌‌కు రూ.2,400 మద్దతు ధర కోసం రైతులు మక్కలను కేంద్రాలకు తీసుకువచ్చారు. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో కేంద్రాలను తొందరపాటుతో ప్రారంభించినప్పటికీ క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు సరిగా సాగలేదు.

ఇప్పటివరకు జిల్లాలో కేవలం 70 వేల క్వింటాళ్ల మక్కలనే కొనుగోలు చేశారు. మిగతా పంటలో కొంత మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉండగా, చాలా వరకు మక్కలను రైతులు తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి కొనుగోళ్లు ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీంతో మక్కలు తీసుకొచ్చిన రైతులు రోజులు తరబడి యార్డుల్లోనే ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

టోకెన్లలో చేతివాటం?

మద్దతు ధర కోసం మార్కెట్ యార్డులకు వచ్చిన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. టోకెన్ల ఆధారంగా కొనుగోళ్లు చేస్తామని ప్రకటించినా చాలా కేంద్రాల్లో అమలు కావడం లేదు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల సిఫార్సులు లేదా సిబ్బందికి డబ్బులు ఇచ్చిన వారికే టోకెన్లు లభిస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తొగుట, చిన్నకోడూరు, సిద్దిపేట, హుస్నాబాద్ మార్కెట్ యార్డుల్లో మక్కల కుప్పలు పేరుకుపోతున్నాయి. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పాటు అకాల వర్షాల భయం రైతులను మరింత కలవరపెడుతోంది. ఏప్రిల్ నెలాఖరు వరకు మక్కలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.

సంచులు, లారీల కొరత..

టోకెన్ వచ్చినా మార్కెట్ యార్డుల్లో బార్దాన్ సంచులు, లారీల కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వేల క్వింటాళ్ల మక్కలకు సరిపడా సంచులు లేకపోవడంతో తూకం వేయడం ఆలస్యం అవుతోంది. తూకం వేసిన సంచులను తరలించడానికి లారీలు కూడా అందుబాటులో లేకపోవడంతో యార్డుల్లోనే మక్కలు పేరుకుపోతున్నాయి. తొగుట, సిద్దిపేట, హుస్నాబాద్, చిన్నకోడూరు ప్రాంతాల్లో వేల క్వింటాళ్ల మక్కలు యార్డుల్లోనే నిల్వ ఉన్నాయని రైతులు చెబుతున్నారు.

రంగంలోకి ప్రైవేటు వ్యాపారులు..

కొనుగోళ్లు ఆలస్యం కావడంతో ప్రైవేటు వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు. యార్డుల్లో రోజుల తరబడి ఎదురుచూసే బదులు తమకు అమ్మాలని రైతులకు వల వేస్తున్నారు. నాణ్యత పేరుతో క్వింటాల్‌‌‌‌కు రూ.1,800 నుంచి రూ.2 వేలు మాత్రమే చెల్లిస్తూ పంటను కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

సంచులు లేవని చెప్తున్నరు

నాలుగు రోజుల క్రితం తొగుట మార్కెట్ యార్డుకు మక్కలు తీసుకొచ్చాను. గన్నీ సంచులు లేవని ఇప్పటికీ కొనుగోలు చేయలేదు. సంచులు వస్తేనే తూకం వేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో యార్డులోనే ఎదురుచూస్తున్నాం.

- కె. మధు, రైతు, ఘనపూర్-