కవ్వాల్ అడవుల్లో మళ్లీ పులులు ...టైగర్ రీ-ఇంట్రడక్షన్ ప్రాజెక్టుకు ఎన్టీసీఏ గ్రీన్ సిగ్నల్

కవ్వాల్ అడవుల్లో మళ్లీ పులులు ...టైగర్ రీ-ఇంట్రడక్షన్ ప్రాజెక్టుకు ఎన్టీసీఏ గ్రీన్ సిగ్నల్
  •     'విజన్ 2047’లో భాగంగా తాడోబా ‌‌అంధేరి నుంచి పులులను రప్పించేలా ప్లాన్ 
  •     శాకాహార జంతువుల సంఖ్య, ఆవాసాల పెంపునకు ప్రత్యేక చర్యలు
  •      అమ్రాబాద్ రిజర్వ్ లోనూ రీ జనరేషన్ చర్యలకు సిఫార్సు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని కవ్వాల్ అభయారణ్యంలో మళ్లీ పులుల గర్జన వినిపించనుంది. శాస్త్రీయ అంచనాలు, సమగ్ర ప్రణాళికల అనంతరం కవ్వాల్‌‌లోకి పులులను పునఃప్రవేశపెట్టడానికి (టైగర్ రీ-ఇంట్రడక్షన్), వాటి సంఖ్యను స్థిరంగా పెంచేందుకు  ‘నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ’ (ఏటీసీఏ) గ్రీన్ సిగ్నల్​ఇచ్చింది. కేంద్రం విడుదల చేసిన ప్రాధాన్యతా జాబితాలో కవ్వాల్ టైగర్  రిజర్వ్‌‌ను ‘కీలక ప్రాంతం’గా చేర్చింది. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్‌‌టీసీఏ), వైల్డ్‌‌ లైఫ్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) సంయుక్తంగా రూపొందించిన 'భారత దేశంలో పులుల క్రియాశీల నిర్వహణ మార్గసూచి' నివేదికలో కీలక అంశాలు  వెల్లడించింది. 

కవ్వాల్ రిజర్వ్‌‌లో స్థానికంగా నివసించి, సంతానోత్పత్తి చేసే పులులు లేవని తేల్చింది. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తాడోబా- అంధేరితో పాటు ఇంద్రావతి పులుల అభయారణ్యం నుంచి కొన్ని పులులు కవ్వాల్​లోకి వచ్చి వెళ్తున్నా..  ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉండటం లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పర్యావరణ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా మొదటి దశ కింద కవ్వాల్​అభయారణ్యంలో పులులు స్థిరంగా ఉండేలా ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. 

ఆహార జంతువులు తక్కువే..

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'విజన్ 2047' రోడ్‌‌మ్యాప్‌‌లో భాగంగా కవ్వాల్‌‌లో పులుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించింది. కాగా, కవ్వాల్​లో పులుల జనాభా పెరగకపోవడానికి శాఖాహార జంతువుల కొరత, పలుచబడిన కారిడార్లే ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయి. కవ్వాల్​రిజర్వ్​ఫారెస్ట్​లో ఉష్ణ మండల ఆకురాల్చే అడవులు, టేకు వనాలు, దట్టమైన వెదురు పొదలు, నదీ తీర ఆవాసాలు విస్తరించి ఉండడంతో పులులు నివసించడానికి అనుకూలమైన ప్రాంతంగా గుర్తించారు. కానీ ఇక్కడ చదరపు కిలోమీటరుకు ఆహార జంతువుల సాంద్రత చాలా తక్కువగా ఉంది. 

ప్రతి చదరపు కిలోమీటరుకు చుక్కల  జింకలు (చిటాల్) 3 నుంచి 4, నీల్ గాయ్ లు 4 నుంచి 5, అడవి పందులు 3 నుంచి 4 ఉండగా.. వీటితో పాటు సాంబార్, చౌసింఘా (నాలుగు కొమ్ముల జింక), గౌర్ (అడవి దున్న)లు  ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇవి పులులకు ఏమాత్రం సరిపోవు. కాబట్టి ఈ అడవిలో ముందుగా శాకాహార జంతువుల సంఖ్యను పెంచి, అటవీ కారిడార్లను పునరుద్ధరించాకే ఈ అడవికి పులులను తీసుకురావాలని నిర్ణయించారు. 

‘ఫేజ్-3’లో అమ్రాబాద్‌‌ ఫారెస్ట్

తెలంగాణలోని మరో ప్రధాన అభయారణ్యం ‘అమ్రాబాద్ టైగర్ రిజర్వ్’ను మూడో దశ (ఫేజ్-3) కింద వర్గీకరించి పులులు, వాటి ఆహార జీవుల పునరుద్ధరణ జాబితాలో చేర్చారు. ప్రస్తుతం అమ్రాబాద్‌‌లో పులుల జనాభా, ఆహార జీవుల లభ్యత పర్యావరణ సామర్థ్యం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, అక్కడ పులులు సంతానోత్పత్తి చేయడానికి అనుకూల వాతావరణం ఉంది. అడవిలో మానవ సంచారాన్ని తగ్గించడం, శాఖాహార జంతువులను పెంచడం, పులుల రక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కు తిరిగి పూర్వవైభవం తేవచ్చని నివేదికలో స్పష్టం చేశారు.  

ఎనిమిది నెలలపాటు సర్వే 

గతేడాది నవంబర్ ఈ ఏడాది జూన్ వరకు ఎనిమిది నెలల పాటు నిర్వహించిన అఖిల భారత పులుల అంచనా (ఏఐటీఈ 2026) ప్రోగ్రాం కింద కవ్వాల్, అమ్రాబాద్ రిజర్వ్​ఫారెస్ట్​లలో 42 పులులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో ఆడ, మగ పులులతో పాటు యుక్త వయస్సుకు రానివి, కూనలు కూడా ఉన్నాయి. కాగా, కేంద్ర  ప్రభుత్వం, ఎన్టీసీఏ ప్రకటించిన మాస్టర్ ప్లాన్ సమర్థవంతంగా అమలు జరిగితే త్వరలోనే కవ్వాల్ అడవుల్లో పులులు సంచారం కనిపించనుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది.