- లేట్ పెండ్లిళ్లు, ఒత్తిడి, ఊబకాయం, డయాబెటిస్, పీసీఓడీ కారణాలు
- ప్రభావం చూపుతున్న నగర జీవనశైలి
- సగం కేసుల్లో పురుషుల్లోనే లోపం
హైదరాబాద్ సిటీ, వెలుగు: పట్టణ జీవనశైలి వల్ల దేశంలో 2.8 కోట్ల మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారని, ఇందులో 10 నుంచి15 లక్షల ఐవీఎఫ్ కు వెళ్తే సంతానం కలిగే అవకాశం ఉన్నా 3 నుంచి 3.5 లక్షల మంది మాత్రమే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని తేలింది. జూలై 25న ఏటా వరల్డ్ ఐవీఎఫ్ డే జరుపుకుంటుండగా కొన్ని ఆసక్తికర వివరాలను డాక్టర్లు వెల్లడించారు. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉద్యోగ ఒత్తిడి, ఊబకాయం, డయాబెటిస్, పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలు, పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గడం ప్రధాన కారణాలని చెప్తున్నారు. గుండె ఆరోగ్యం, బీపీ, షుగర్ వంటి అంశాలపై దృష్టి పెట్టినంతగా సంతానోత్పత్తి అంశంపై పెట్టడం లేదంటున్నారు.
మహిళల్లో 35 ఏండ్లు దాటాక సంతానోత్పత్తి సామర్థ్యం సహజంగానే తగ్గుతుందని, ఆ లోపు వారు ఏడాది పాటు, 35 ఏండ్లు దాటినవారు 6 నెలల ప్రయత్నం తర్వాత గర్భం దాల్చకపోతే వెంటనే ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించాలని కిమ్స్ కడల్స్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ కె. శిల్పిరెడ్డి సూచించారు. హెల్త్ ఇన్య్సూరెన్స్లో ఫెర్టిలిటీ చికిత్సలను చేర్చకపోవడం, కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లలో ఫెర్టిలిటీ హెల్త్ బెనిఫిట్స్‌ను అందించకపోవడం పెద్ద లోపమని, అవి అందించేలా ప్రోత్సహించాలని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ డైరెక్టర్ డాక్టర్ సరోజ కొప్పాల అంటున్నారు. సంతానలేమి అనేది కేవలం మహిళల సమస్యే కాదని, దాదాపు సగం కేసుల్లో పురుషులే కారణమై ఉంటారని అంటున్నారు. సమాజంలో ఉన్న అపోహలు, విమర్శల భయంతో చాలామంది డాక్టర్లను సంప్రదించడంలో జాప్యం చేస్తున్నారన్నారు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం ఉంటుందంటున్నారు.
