న్యూఢిల్లీ: గతంలో ఓటు చోరీ, ఆ తర్వాత ప్రభుత్వ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో సీటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల సంఘం (ఈసీ) సహకారంతో బీజేపీ ఇలా చేస్తోందని విమర్శించారు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించిన నేపథ్యంలో రాహుల్ గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో పోటీ మొదలుకాకముందే ముగిసిపోయేలా చేశారని మండిపడ్డారు. మీనాక్షి నటరాజన్ అన్ని పత్రాలు సమర్పించినా, బీజేపీ అభ్యంతరాల ఆధారంగా ఈసీ ఆమె నామినేషన్‌ను రద్దు చేసిందన్నారు.
కానీ జార్ఖండ్‌లో బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన స్వతంత్ర రాజ్యసభ అభ్యర్థి పరిమల్ నత్వానీ విషయంలో మాత్రం ఎన్నికల సంఘం వేరే విధంగా వ్యవహరించిందని ఆరోపించారు. నామినేషన్ ఫారంలో పేరు, ఇతర వివరాలను తప్పుగా రాస్తే, సరిచేసుకునేందుకు గడువు ఇచ్చారని చెప్పారు. ఒకే ఎన్నికల సంఘం ఇద్దరు అభ్యర్థుల విషయంలో రెండు రకాలుగా వ్యవహరించిందని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ఎన్నికల సంఘాన్ని కలవాలని ప్రయత్నించగా మొదట అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని రాహుల్ తెలిపారు. తర్వాత కలిసినా తమ అభ్యంతరాలపై సరైన స్పందన రాలేదన్నారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవడం కంటే ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికే బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు.
