రెడ్, గ్రీన్, పర్పుల్, పింక్ కలర్స్ యూనిఫామ్స్‌లో ఉన్న ఈ ఫొటో చూడ్డానికి భలే ఉంది కదా! ఇదేదో కాలేజీ ప్రోగ్రాం అనుకుంటే పొరపాటు. వీళ్లంతా ఒక పోటీలో పాల్గొన్న వాళ్లు. ఒక్కో రంగు ఒక్కో టీం అన్నమాట. ఇంతకీ ఆ పోటీ ఏంటంటే...
స్పెయిన్‌లోని టర్రగొన సిటీలో ప్రతి రెండేండ్లకు ఒకసారి ‘క్యాస్టెల్స్’ అనే ఉత్సవం జరుగుతుంది. అందులో భాగంగానే ఇలాంటి హ్యూమన్ టవర్స్ నిర్మించేలా విన్యాసాలు చేస్తారు. వీటికి మరోపేరే క్యాస్టెల్స్. ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ కేటగిరీలో 2010లో యునెస్కో జాబితాలో చేరింది.
టర్రగొనలోని కెటలోనియా ప్రాంతంలోని వాల్స్ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు 18వ శతాబ్దం నుంచి ఈ ట్రెడిషన్‌ని ఫాలో అవుతున్నారు. అందులో భాగంగా కొందరు ‘క్యాస్టెలర్స్’ టీమ్‌లుగా ఏర్పడతారు. ఆ టీమ్‌ల మధ్య క్యాస్టెల్స్ పోటీ జరుగుతుంది. ఏ టీం అయితే ఎక్కువ ఎత్తులో టవర్లా నిలుచుంటారో వాళ్లే విజేతలు. ఈ పోటీలో గెలిచిన వాళ్లకి16వేల యూరోలు అంటే12 లక్షల 89 వేల120 రూపాయల ప్రైజ్‌మనీ ఇస్తారు. మొదటి నుంచి చివరి వరకు ఎగ్జైటింగ్‌గా జరిగే ఈ పోటీలో ఈసారి విలఫ్రాంక అనే టీం దాదాపు 43 అడుగుల ఎత్తైన టవర్గా ఫామ్ అయ్యారు. ఈ పోటీలో 40 టీంలను ఓడించి, ప్రైజ్‌మనీ కొట్టేసింది విలఫ్రాంక టీం. ఈ పోటీ1932లో మొదటిసారి టర్రగొన బుల్ రింగ్‌లో జరిగింది. ఆ తర్వాత1970 నుంచి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
