కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ

కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) విద్యార్థుల్లో మూఢత్వం పెంచేలా ఉందని త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ అన్నారు. పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగానే ఈ పాలసీని తయారుచేశారని విమర్శించారు. సైంటిఫిక్ ఆలోచనలు పెంచే విద్యావిధానం కోసం విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్​లోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో విద్యారంగం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ పథకం ప్రకారం ఎడ్యుకేషన్ సిస్టమ్​ను ధ్వంసం చేస్తున్నాయని ఆరోపించారు. 

కేంద్రం ఎన్ఈపీ ద్వారా ఆర్ఎస్ఎస్​ విధానాలను విద్యారంగంలోకి చొప్పిస్తున్నదని, ఇది చాలా ప్రమాదకరమన్నారు. ఒకేదేశం.. ఒకే మతం పేరుతో దేశంలో హిందూరాజ్యాన్ని స్థాపించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్ వీపీ సాను అధ్యక్షతన జరిగిన సభలో ఎస్ఎఫ్ఐ జాతీయ నేతలు మయూక్ బిశ్వాస్, థీఫ్సితా ధర్, దీనిత్ డెంటా, నితీష్ నారాయణ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్​  మూర్తి, తాళ్ల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రసాద్ ఐమ్యాక్స్ నుంచి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వరకూ ఎస్ఎఫ్ఐ జెండాలతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.