- 85 పనుల కోసం పంచాయతీ రాజ్ శాఖ ప్రపోజల్స్
- శాశ్వత నిర్మాణాలపై సర్కార్ యోచన
- బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక శోభ
- 2027 జూన్ 26 నుంచి ఆది పుష్కరాలు
- 8 కోట్ల మంది భక్తులు స్తారని అంచనా
హైదరాబాద్, వెలుగు : గోదావరి నదికి రాబోయే పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తును మొదలుపెట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ (పీఆర్) ఇంజినీరింగ్ శాఖ రూ.99 కోట్లతో 85 అభివృద్ధి పనులను చేపట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు సమగ్ర రోడ్ మ్యాప్‌తో కూడిన ప్రపోజల్స్‌ను రెడీ చేసి ప్రభుత్వ అనుమతి కోసం పంపించింది.
రాష్ట్రంలో గోదావరి ప్రవహించే ఎనిమిది జిల్లాల పరిధిలో పుష్కర పనులు చేపట్టనున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర నుంచి మొదలుకొని నిజామాబాద్, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం పరిధిలో పుష్కర ఘాట్లను అధికారులు ఇప్పటికే గుర్తించారు. బాసర నుంచి భద్రాచలం వరకు సుమారు 500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నదీ పరివాహక ప్రాంతంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే తొమ్మిది కీలక ప్రాంతాలను ‘టైర్-1’ కింద ఎంపిక చేశారు.
అన్నీ శాశ్వత నిర్మాణాలే..
గతంలో పుష్కరాల సమయంలో తాత్కాలిక షెడ్లు మాత్రమే ఏర్పాట్లు చేసేవారు. అయితే, ఈ సారి ప్రభుత్వం వ్యూహం మార్చింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధాన రహదారుల నుంచి పుష్కర ఘాట్లకు వెళ్లే అప్రోచ్ రోడ్ల నిర్మాణం, బీటీ రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. ఘాట్ల వద్ద శాశ్వత మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, స్నానపు గదులు నిర్మించనున్నారు. మురుగునీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ పైప్‌లైన్లు, నిరంతర నీటి సరఫరా కోసం వాటర్ ట్యాంకుల నిర్మాణం, ఘాట్ల దారిలో హైమాస్ట్ లైట్లు, ఆధునిక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు.
తొమ్మిది కొత్త పవిత్ర యాత్రా సర్క్యూట్లు
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు నిర్వహించనున్నారు. తిరిగి 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలు జరగనున్నాయి. ఈ రెండు విడతల్లో కలిపి సుమారు ఎనిమిది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భారీగా వచ్చే జనాన్ని నియంత్రించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. కాగా, పుష్కరాల నిర్వహణ కోసం 2026–-27 బడ్జెట్‌లో ట్‌లో ప్రభుత్వం ఇప్పటికే రూ. 500 కోట్లు కేటాయించింది.
పనుల పర్యవేక్షణకు మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భద్రాచలం, ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ 9 కొత్త ‘పవిత్ర యాత్రా సర్క్యూట్లను’ దేవాదాయ, టూరిజం శాఖలు సంయుక్తంగా రెడీ చేశాయి. ఇందులో భాగంగా వేములవాడ రాజన్న ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు ముమ్మరంగా సాగుతుండగా.. బాసర, భద్రాచలం ఆలయాల అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. గోదావరి పుష్కరాల ముందే పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు.

