ప్రధాని మోడీ తెలంగాణ టూర్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మే 9న రాష్ట్రానికి రానున్నారు ప్రధాని మోడీ. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో మోడీ రాష్ట్రంలో వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని సమాచారం. సుదీర్ఘ కాలంగా ఎదురు ఎంఎంటీఎస్ ఫేజ్-2 ను జాతికి అంకితం ఇవ్వనున్నారు మోడీ.
వరంగల్ లో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు మరికొన్ని రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు మోడీ. బీబీనగర్ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన విభాగాలను ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా పలు జాతీయ రహదారుల నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు మోడీ.
ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మోడీ రాష్ట్రానికి వస్తున్న క్రమంలో ఈ సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపాలని భావిస్తోంది బీజేపీ నాయకత్వం.

