హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతి గురించి మాట్లాడినందుకే తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. నిజంగా కాళేశ్వరంలో అవినీతి చేసిన చేసిన పందికొక్కులను కేసీఆర్ పక్కనబెట్టుకున్నారన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చాలా తప్పులు చేసిందని ఆరోపించారు.
‘‘తెలంగాణను పదేళ్లు పాలించిన కుటుంబంలో నేను భాగస్వామ్యంగా ఉన్నా. అప్పుడు అనేక తప్పులు, నేరాలు జరిగాయి. పదేళ్లలో జరిగిన తప్పిదాల్లో నాకు భాగస్వామ్యం ఉంది. జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవడానికే మీ ముందుకు వచ్చా. తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు గర్వపడుతున్నా. పదేళ్లు పాలించిన ఫ్యామిలీలో భాగస్వామ్యంగా ఉన్నందుకు కొన్ని విషయాలకు సిగ్గు పడుతున్నా.. క్షమించాలి’’ అని కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, పార్టీ లైన్ క్రాస్ చేసిందన్న కారణంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
శనివారం (ఏప్రిల్ 25) మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో కవిత తన కొత్త పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటించారు. తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో పోరాటం చేశానని.. ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ఊరూరు తిరిగానని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న ప్రజల కలలు, ఆకాంక్షలు నిజం కాలేదు.. తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పిందన్నారు.

