షాపింగ్ మాల్స్ దగ్గర కూపన్లు ఇస్తే తీసుకుంటున్నారా...? హైదరాబాద్ లో ఏం జరిగిందో చూడండి..!

షాపింగ్ మాల్స్ దగ్గర కూపన్లు ఇస్తే తీసుకుంటున్నారా...? హైదరాబాద్ లో ఏం జరిగిందో చూడండి..!

హైదరాబాద్ లో హాలిడేస్ ట్రిప్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పసిఫిక్ హాలిడే వరల్డ్ కంపెనీ పేరుతో అమాయకులే లక్ష్యంగా చేసుకొని కోట్లు దండుకున్న 15 మంది కేటుగాళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో హాలిడేస్ ట్రిప్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 15 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, ది పసిఫిక్ హాలిడే వరల్డ్ కంపెనీ పేరుతో మోసాలకు పాపడుతోంది ముఠా.  మొత్తం 15 మంది సభ్యులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

షాపింగ్ మాల్స్, షోరూమ్‌ల వద్ద కూపన్లు పంపిణీ చేస్తూ... "మీకు గిఫ్ట్ కూపన్ వచ్చింది", "హాలిడే ప్యాకేజీ గెలుచుకున్నారు" అంటూ ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడుతోంది ఈ ముఠా. బాధితుడి ఫిర్యాదు మేరకు రాడిసన్ హోటల్‌లో మాటువేసిన పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో ఇప్పటివరకు 19 మంది బాధితుల నుంచి సుమారు రూ.22 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ కేంద్రంగా ఈ ముఠా దేశంలోని పలు నగరాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. ముఠా కార్యకలాపాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.