ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసన ప్రదేశంలో పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) కెమెరాలను ఏర్పాటు చేశారు. నీట్ (NEET) పేపర్ లీక్ వివాదానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడ ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనల్లోకి అసాంఘిక శక్తులు, నేరస్థులు చొరబడకుండా నిరోధించేందుకే ఈ నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఎందుకు ఈ కెమెరాలు
నిరసనల ముసుగులో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఎవరైనా లోపలికి ప్రవేశిస్తే వారిని వెంటనే గుర్తించవచ్చు. ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల వద్ద ఈ ఎఫ్‌ఆర్‌ఎస్ యూనిట్లను అమర్చారు. ఎవరైనా వాంటెడ్ క్రిమినల్స్ కనిపిస్తే ఈ కెమెరాలు తక్షణమే (Real-time) ముఖాలను పోల్చి పోలీసులను అప్రమత్తం చేస్తాయి. అయితే, ఇది కేవలం నేరస్థుల కోసం మాత్రమేనని.. అసలైన నిరసనకారులను ఇబ్బంది పెట్టడానికి కాదని పోలీసులు స్పష్టం చేశారు.
ఘర్షణలు, డిమాండ్లు
జూలై 20న ఇదే నిరసన ప్రదేశంలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగి.. నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. సాధారణ దుస్తుల్లో ఉన్న కొందరు మాపై లాఠీలతో దాడి చేశారని ఆందోళనకారులు ఆరోపించారు.
మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే ప్రధాన డిమాండ్. దీనిపై సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై ఉన్న కేసుల కొట్టివేసే డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు.
మరోవైపు, మంత్రి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, బీజేపీ ఆయనకు పూర్తిగా అండగా ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
