రాజీనామా చేస్తూ.. ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే..!

రాజీనామా చేస్తూ.. ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే..!

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ మేరకు నీట్ పేపర్ లీకేజీకి నైతిక వహిస్తూ ఆయన పదవి నుంచి వైదొలిగారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాతో విద్యార్థుల ప్రధాన డిమాండ్ నెరవేరింది. విద్యార్థులు, సీజేపీ ఆందోళనలకు మోడీ సర్కార్ తలొగ్గడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తూ రాసిన లేఖ ఇదే:

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తూ దేశ యువతను ఉద్దేశించి లేఖ రాశారు. సోషల్ మీడియా వేదికగా ఈ లేఖను విడుదల చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాసిన లేఖ యథాతథంగా కింద ఇచ్చాం. 

‘‘నేను గత 4 దశాబ్దాలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం అంకితభావంతో పనిచేస్తున్నాను. ఒక శక్తివంతమైన, సమగ్రమైన దూరదృష్టి కలిగిన విద్యా వ్యవస్థ మాత్రమే బలమైన దేశానికి పునాది అని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. దేశ యువత ఆకాంక్షలు, భావోద్వేగాలు వారి న్యాయమైన అంచనాలను నేను తీవ్రంగా గౌరవిస్తాను. భారతీయ యువత కలలను సాకారం చేయడం మనందరి రాజకీయ, సామాజిక జీవిత నైతిక సంకల్పం.  ప్రధాని మోడీ దూరదృష్టి కలిగిన నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం నాకు లభించినందుకు ప్రధానికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

2026, 3 మే 2026న జరిగిన NEET-UG పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలింది. భారత ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి విచారణను సీబీఐ (CBI)కి అప్పగించింది, పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష తేదీని ప్రకటించింది. దీనితో పాటు వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను CBT (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) మోడ్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సమయంలో 20 లక్షలకు పైగా విద్యార్థులకు పరీక్షలు సునాయాసంగా జరిగేలా చూడటమే మా ముఖ్య ప్రాధాన్యతగా ఉంది. ఇందుకోసం 'హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్' (ప్రభుత్వ సమగ్ర విధానం) కింద పనిచేయడం జరిగింది. ఇందులో భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కీలక పాత్ర పోషించాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారంతో 21 జూన్ 2026న ఈ పరీక్ష పూర్తయింది.

మొదటి రోజు నుంచే దీనికి నేను బాధ్యత వహించాను. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. పరీక్షల మాఫియా వల్ల ఏ ప్రతిభావంతుడైన విద్యార్థి భవిష్యత్తు పాడవకూడదని, ఏ విద్యార్థికీ అన్యాయం జరగకూడదన్నదే నా సంకల్పం. జులై 16న ప్రకటించిన నీట్-యూజీ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఇందులో పేద నేపథ్యం ఉన్న అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా విజయం సాధించారు. 

అయితే, ఈ సమయంలో కొందరు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు విద్యార్థులను తప్పుదోవ పట్టించడానికి, అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. ఇది నా మనస్సును తీవ్రంగా బాధించింది. మన ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచలమైన నమ్మకం ఉంది. యువత ఆకాంక్షలు, కలలు, అంచనాలను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. వారు భారతదేశ భవిష్యత్తు మాత్రమే కాదు.. ఒక నూతన వికసిత భారత్ నిర్మాణానికి శిల్పులు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా బాధపడింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు. 

ALSO READ : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

భారతీయ యువశక్తి ఈ దేశానికి అసలైన బలం. దేశ యువశక్తిని భ్రమల చక్రవ్యూహంలో చిక్కుకోనివ్వకూడదన్నదే నా సంకల్పం. జంతర్ మంతర్ వద్ద, దేశంలో ఏర్పడిన పరిస్థితిని దేశ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకోకూడదని, దేశ సమైక్యత నిలిచి ఉండాలని, భారతదేశంలోని ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకూడదని.. మన పిల్లలు తమ సమయాన్ని చదువుకే కేటాయించి కెరీర్ నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తూ.. నేను నా రాజీనామా లేఖను ప్రధానమంత్రికి పంపాను. 

ప్రధానమంత్రి మార్గదర్శకత్వం, నమ్మకం, నిరంతర సహకారానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే నా మంత్రిమండలి సహచరులకు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బందికి, నాతో కలిసి పనిచేసే భాగ్యం పొందిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేశ సేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యత, దీనికోసం నేను ఎల్లప్పుడూ అంకితభావంతో ఉంటాను. శ్రీ జగన్నాథ స్వామివారి ఆశీస్సులతో భవిష్యత్తులో కూడా భారత్ మాత, ఒడిశా ప్రజలు, దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి నన్ను నేను ప్రతి విధంగా అంకితం చేసుకుంటాను’’ అని ధర్మేంద్ర ప్రధాన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.