V6 News

కేఎల్ రాహుల్ విధ్వంసం.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

కేఎల్ రాహుల్ విధ్వంసం.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

DC vs PBKS: అరుణ్ జైట్లీ స్టేడియం సాక్షిగా ఐపీఎల్ 2026లో సరికొత్త చరిత్ర లిఖించబడింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించడంతో పంజాబ్ కింగ్స్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక (11) త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ, అది తుపాను ముందున్న ప్రశాంతత అని పంజాబ్ ఊహించలేకపోయింది.

రాహుల్ 'రాక్షస' బ్యాటింగ్: 
క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే కేఎల్ రాహుల్ బౌండరీల వేట మొదలు పెట్టాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న రాహుల్, ఆ తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చాడు. వైశాక్ విజయ్ కుమార్ వేసిన 16వ ఓవర్లో 6, 6, 6, 4 బాది ఒకే ఓవర్లో 24 పరుగులు పిండుకున్నాడు. మొత్తంగా 67 బంతుల్లో 152 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

నితీష్ రాణా 'కిరాక్' బ్యాటింగ్: 
రాహుల్‌కు తోడుగా నితీష్ రాణా కూడా పంజాబ్ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. ముఖ్యంగా జేవియర్ బార్ట్‌లెట్ వేసిన 12వ ఓవర్లో రాణా శివతాండవం చేశాడు. ఆ ఓవర్లో 6, 4, 4, 4, 4, 6 బాది ఏకంగా 29 పరుగులు రాబట్టడమే కాకుండా తన హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 91 పరుగులు చేసిన రాణా.. సెంచరీకి చేరువలో బార్ట్‌లెట్ బౌలింగ్‌లోనే శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

పంజాబ్ బౌలర్ల వైఫల్యం:
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జేవియర్ బార్ట్‌లెట్ చెరో వికెట్ తీయగా, మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫీల్డింగ్‌లో శశాంక్ సింగ్ క్యాచ్‌లు వదిలేయడం కూడా ఢిల్లీకి కలిసొచ్చింది. చివరికి 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 264 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ముందు ఉంచింది. ఇంతటి భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఎలా ఛేదిస్తుందో వేచి చూడాలి.