కాంస్య పతకం సాధించిన బాక్సర్ ..ఒకప్పుడు వాలీబాల్ ప్లేయర్ ...

కాంస్య పతకం సాధించిన బాక్సర్ ..ఒకప్పుడు వాలీబాల్ ప్లేయర్ ...

మనీషా మౌన్..ఇన్నాళ్లు ప్రపంచానికి తెలియని పేరు. ఇప్పుడు ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ద్వారా అందరికి పరిచయమైన పేరు. తండ్రి ట్రాక్టర్ మెకానిక్...నిరుపేద కుటుంబం... రెక్కాడితే కానీ డొక్కాడని జీవనం... అయినా ఆసక్తి,  కసి, జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన.. మనీషాను ఉన్నతస్థాయికి ఎదిగేలా చేశాయి. ప్రపంచ బాక్సింగ్ వేదికపై భారత దేశం గర్వించదగ్గ మెడల్ను సాధించేలా చేసింది. 


కుటుంబ నేపథ్యం..
హర్యానా రాష్ట్రంలోని ఖైతల్ జిల్లా మాతూర్ గ్రామంలో 1997 డిసెంబర్ 23న  మనీషా మౌన్ జన్మించింది. మనీషా తండ్రి ట్రాక్టర్ మెకానిక్.  ముగ్గురు సంతానంలో మనీషా చిన్నది. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే మనీషాకు చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి ఉండేది. అందుకు ఆమె అన్న ఒక కారణం. అతను వాలీబాల్ ప్లేయర్ కావడంతో...మనీషా మొదట్లో వాలీబాల్ ఆడటం ప్రారంభించింది. తల్లిదండ్రులు వ్యతిరేకించినా..సోదరుడితో కలిసి కైతాల్‌లోని RKSD కళాశాల స్టేడియంలో మనీషా వాలీబాల్ ఆడేది.


వాలీబాల్ ప్లేయర్ బాక్సర్గా మారిన వేళ..
మనీషా వాలీబాల్ ఆడుతున్న సమయంలో బాక్సింగ్ కోచ్ రాజేందర్ సింగ్ ఆమెను గమనించాడు. మనీషాకు సరైన శిక్షణ ఇస్తే గొప్ప బాక్సర్గా ఎదుగుతుందని భావించాడు. ఇదే ఆమె జీవితంలో అతిపెద్ద మలుుపు. మనీషాను కలిసిన బాక్సింగ్ కోచ్...బాక్సింగ్ నేర్చుకోవాలని సూచించాడు. కోచ్ మాటలతో బాక్సింగ్పై ఇంట్రస్ట్ పెంచుకున్న మనీషా..12 ఏళ్ల వయసులో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. మనీషా తల్లిదండ్రులకు ఈ విషయం తెలియదు. ఆమె వాలీబాల్ నేర్చుకుంటుంది అనుకున్నారు. బాక్సింగ్లో శిక్షణ తీసుకుంటూనే మనీషా..  పేరెంట్స్ కు తెలియకుండానే చిన్న చిన్న ఛాంపియన్ షిప్లలో పాల్గొనడం ప్రారంభించింది. రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో మౌన్ పతకాన్ని గెలుచుకుంది. ఈ వార్త కైతాల్ పత్రికలో రావడంతో మనీషా తండ్రి చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. అయితే కూతురు ప్రతిభ, ఆసక్తి గమనించి ఆ తర్వాత అంగీకరించాడు. 

తండ్రికి గుండెపోటు..ఇళ్లు గడవలేని పరిస్థితి..
ట్రాక్టర్ మెకానిక్ గా పనిచేసే మనీషా తండ్రికి గుండెపోటు వచ్చింది. తండ్రి అనారోగ్యం కారణంగా పనిచేయలేని స్థితి. ఈ సమయంలో ఇళ్లు గడవడమే కష్టంగా మారింది. అయితే మనిషా టోర్నీల్లో సాధించిన ప్రైజ్ మనీ తన కుటుంబానికి అన్నం పెట్టింది. టోర్నీల్లో గెలిచిన డబ్బంతా తల్లికి తీసుకొచ్చి ఇచ్చేది మనీషా మౌన్. ఆ డబ్బుతో మనీషా తల్లి ఇంటిని నెట్టుకొచ్చేది. 


పతకాల మనీషా..
బాక్సర్ గా మనీషాను అనేక పతకాలు వరించాయి. 2013లో  హర్యానా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో  రజతం, 2016, 2017లో వరుసగా ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్శిటీ టైటిళ్లను సాధించింది. 2018లో మూడు అంతర్జాతీయ పతకాలను మనీషా గెలుచుకుంది. 2018లో ఢిల్లీలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ట్రయల్స్‌ లో విజయం సాధించింది.  2019లో ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచింది. 2019లో మోచేయి గాయంతో మనీషా 57 కేజీల విభాగానికి మారాలని నిర్ణయించుకుంది. అయితే ఈ విభాగంలో ఆమె మాజీ ప్రపంచ యూత్ ఛాంపియన్ సాక్షి చౌదరి, మాజీ ప్రపంచ పతక విజేత సోనియా లాథర్, సోనియా చాహల్ వంటి వారితో పోటీపడి ఓడింది. ఆ తర్వాత 2020లో జర్మనీలో జరిగిన కొలోన్ ప్రపంచ కప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 


టాప్ పథకం నుంచి తొలగింపు..
కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులకు అమలు చేస్తున్న టాప్ పథకం నుంచి ఆమెను తొలగించిన సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున మనీషా నిరాశకు గురైంది. అయితే తాజాగా ప్రపంచ మహిళ బాక్సింగ్ ఛాంపియన్ లో సాధించిన కాంస్య పతకంతో ..తిరిగి టాప్ పథకంలో మనీషా చేరుతుందని కోచ్ సత్వీర్ కౌర్, కుటుంబ సభ్యులు అశిస్తున్నారు. 
 

మరిన్ని వార్తల కోసం...

దొరల పాలనకు చరమ గీతం పాడాల్సిందే

రాష్ట్రంలో ఆటో,క్యాబ్స్ బంద్..టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సెస్