సికింద్రాబాద్, వెలుగు: దారి దోపిడీకి పాల్పడుతున్న ఆరుగురిని మారేడ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నార్త్‌జోన్ డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌కు చెందిన వనపర్తి ప్రభు కుమార్(18), గుండమల్ల మనీశ్‌కుమార్(19), మల్కాజిగిరికి చెందిన దాసారం శ్రీకాంత్(23), షేక్ అష్రఫ్ అహ్మద్(24), కొలుపుల రాజా(24), యాప్రాల్ బాలాజీనగర్‌కు చెందిన పొలిపోగు రాజు(18) అంతా స్నేహితులు. ఈ నెల 11న ప్రభుకుమార్ పార్టీ ఇస్తానని చెప్పడంతో సికింద్రాబాద్ గాంధీ కాలనీలోని అతడి ఇంటికి మిగతా ఐదుగురు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 10 గంటలకు అందరూ కలిసి జేబీఎస్ పార్కింగ్ ఏరియాలో మద్యం తాగారు. మందు అయిపోవడంతో కొనేందుకు డబ్బులు లేక దారి దోపిడీకి స్కెచ్ వేశారు.
అదే టైమ్‌లో ఫ్రెండ్‌ను బస్సు ఎక్కించేందుకు జేబీఎస్‌కు వచ్చిన చిలుకానగర్‌కు చెందిన భాను ప్రసాద్‌ను ఈ గ్యాంగ్ అడ్డుకుంది. భాను ప్రసాద్‌పై దాడి చేసి అతడి దగ్గరున్న సెల్ ఫోన్‌ను లాక్కుని పారిపోయారు. సెల్‌ఫోన్‌ను మరోచోట అమ్మగా వచ్చిన డబ్బుతో మద్యం తాగారు. అయితే, వీరి దాడిలో గాయపడ్డ భాను ప్రసాద్ మారేడ్‌పల్లి పీఎస్‌లో కంప్లయింట్ చేయగా.. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు ప్రభుకుమార్‌ను అతడి ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు ఇచ్చిన సమాచారంతో మిగతా ఐదుగురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించారు. ఇదే విధంగా మద్యం కోసం ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి డబ్బు, సెల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లిన మరో ఆరుగురిని సైతం అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు.

