న్యూఢిల్లీ: ఇండియా స్టాక్ మార్కెట్ డైరెక్షన్‌ను ఈ వారం కూడా అమెరికా–-ఇరాన్ సంక్షోభం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ముడి చమురు ధరలు నిర్ణయించనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. వీటితో పాటు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 2,090.2 పాయింట్లు (2.7శాతం), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 532.65 పాయింట్లు (2.2శాతం) చొప్పున భారీగా పతనమయ్యాయి.
అమెరికా–-ఇరాన్ యుద్ధం, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ప్రాంతంలో జరిగే పరిణామాలను మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తోంది. ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్లు కోలుకుంటాయి. లేదంటే మరింత పతనమయ్యే ప్రమాదం ఉంది.
బ్రెంట్ క్రూడాయిల్ ధర ఇప్పటికే బ్యారెల్‌కు 109 డాలర్లకు చేరింది. చమురు భయాల వల్ల గత శుక్రవారం డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా 96 మార్కు కంటే కిందకు పడిపోయింది. రూపాయి కదలికలు ఈ వారం ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయి.
ఈ వారం విడుదలయ్యే భారత్, అమెరికా, చైనా దేశాల ఆర్థిక డేటాతో పాటు యూఎస్ ఫెడ్ మీటింగ్ మినిట్స్ కీలకం కానున్నాయి. అలాగే ఐఓసీ, బీపీసీఎల్, గెయిల్, ఎన్‌టీపీసీ వంటి దిగ్గజ కంపెనీల క్వార్టర్లీ ఫలితాలు ఆయా షేర్ల కదలికలను నిర్ణయిస్తాయి.
- రూ.27,048 కోట్ల షేర్లు అమ్మిన ఎఫ్‌ఐఐలు
ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఈ నెలలో ఇప్పటివరకు నికరంగా రూ.27,048 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. జియో పొలిటికల్ టెన్షన్ల మధ్య జాగ్రత్త వహిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నికరంగా రూ.2.2 లక్షల కోట్లను మార్కెట్ నుంచి విత్‌డ్రా చేసుకున్నారు. కిందటేడాది రూ.1.66 లక్షల కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
