స్టాక్ మార్కెట్ నష్టాలతో రూ.11లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు.. కారణాలు ఇవే

స్టాక్ మార్కెట్ నష్టాలతో రూ.11లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు.. కారణాలు ఇవే

భారత స్టాక్ మార్కెట్ మంగళవారం బ్లడ్ బాత్ నమోదైంది. ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు.. దేశీయంగా ఐటీ రంగంలో వచ్చిన కుదుపులతో మార్కెట్‌ను పాతాళానికి తొక్కేశాయి. ఒక్కరోజే సెన్సెక్స్ 1,450 పాయింట్లకు పైగా కుప్పకూలడం ఇన్వెస్టర్లను అయోమయానికి గురిచేసింది. దీంతో ఒక్కరోజునే ఇన్వెస్టర్ల సంపద రూ.11 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. 

మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,456 పాయింట్లు నష్టపోయి 74,559 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 436 పాయింట్లు పడిపోయి 23,379 వద్ద ముగిసింది. వరుసగా 4వ రోజు కూడా మార్కెట్లు నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి.

ఈ భారీ పతనానికి ప్రధాన కారణాలు..

1. ముడిచమురు ధరల పెరుగుదల 
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2.45 శాతం పెరిగి 106.75 డాలర్లకు చేరింది. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం మార్కెట్‌ను దెబ్బతీసింది.

2. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు 
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం బలహీనంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధ భయాలను మరింత పెంచాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు.

3. ఐటీ షేర్లు
OpenAI సంస్థ 4 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కొత్త ఏఐ సంస్థను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో భారత ఐటీ కంపెనీల వ్యాపార భవిష్యత్తుపై ఆందోళనలు కమ్ముకున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 3.7 శాతం పడిపోయి మే 2023 నాటి కనిష్ట స్థాయికి చేరింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజాలు భారీగా నష్టపోయాయి.

4. ప్రధాని మోడీ పొదుపు పిలుపు 
గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో ప్రజలు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని, ఇంధన పొదుపు కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ప్రధాని సూచించడంతో రియల్ ఎస్టేట్, జ్యువెలరీ షేర్లు భారీగా పతనమయ్యాయి.

5. రూపాయి విలువ పతనం 
ముడిచమురు ధరల ప్రభావంతో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 95.63 స్థాయికి పడిపోయి ఆల్ టైమ్‌లో రికార్డు సృష్టించింది. ఇది విదేశీ ఇన్వెస్టర్లలో ఆందోళన నింపింది.

6. మార్కెట్ భయం 
మార్కెట్ ఒడిదుడుకులను సూచించే ఇండియా విక్స్ 2 శాతం పెరిగి 18.87కి చేరింది. దీనివల్ల సమీప భవిష్యత్తులో మార్కెట్ మరింత అనిశ్చితిగా ఉంటుందని అర్థమవుతోంది.

7. ద్రవ్యోల్బణ డేటా ఆందోళన 
ఏప్రిల్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం వివరాలు విడుదల కానున్న వేళ ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. 

8. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ 
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కేవలం సోమవారం ఒక్కరోజే రూ.8వేల 437 కోట్ల విలువైన షేర్లను అమ్మేయటం మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది.

9. వీక్లీ ఎక్స్‌పైరీ 
నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ కావడం వల్ల ట్రేడర్లు తమ పొజిషన్లను క్లోజ్ చేసే క్రమంలో భారీ ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. 

10. ప్రపంచ మార్కెట్ల నెగటివ్ ట్రెండ్ 
చైనా, దక్షిణ కొరియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవ్వడం, వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ కూడా బలహీనంగా ఉండటం భారత మార్కెట్‌పై ప్రభావం చూపాయి.