మసూద్ అజార్ హతం?

మసూద్ అజార్ హతం?
  • ఐఏఎఫ్ ఎయిర్ స్ట్రైక్ లో తీవ్ర గాయాలు
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • పాక్ మీడియాలో అనూహ్య కథనాలు

ఇస్లామాబాద్: పుల్వామా అటాక్ సహా భారత్ లో జరిగిన అనేక ఉగ్రదాడులకు కుట్రదారుడు, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజార్ హతమయ్యాడు. ఫిబ్రవరి 26 పాక్ లోని బాలాకోట్ లో  భారత వాయుసేన చేసిన ఎయిర్ స్ట్రైక్ వల్ల మసూద్ ప్రాణాలు కోల్పోయాడు. ఇది పాక్ మీడియా ప్రసారం చేస్తున్న కథనాల సారాంశం.

ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అనూహ్య కథనాలను పాక్ మీడియా సంస్థలు టెలికాస్ట్ చేశాయి. ఐఏఎఫ్ ఎయిర్ స్ట్రైక్ లో మసూద్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రావల్పిండిలోని మిలటరీ ఆస్పత్రిలో చేరిన అతడు చికిత్స పొందుతూ నిన్న ప్రాణాలు వదిలాడు. పాక్ మీడియా ప్రసారం చేస్తున్న ఈ కథనాలపై పాక్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. అయితే మసూద్ అనారోగ్యంతో మరణించినట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి.

అయితే మసూద్ మరణంపై వస్తున్న ఈ కథనాలపై స్పష్టత లేదు. ఓ వైపు పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ఇటీవలే మాట్లాడుతూ మసూద్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని చెప్పుకొచ్చారు.

ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆదిల్ అనే ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి పాల్పడింది తామేనని, జైషే మహమ్మద్ వీడియో సందేశం ద్వారా ప్రకటించుకుంది.

పుల్వామా దాడి విషయంలో మసూద్ పై చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తుంటే.. ఆ దాడితో అతడికి సంబంధం లేదని ఖురేషీ మీడియాతో చెప్పారు. మసూద్ తో పాక్ ప్రభుత్వం టచ్ లో ఉందని కూడా స్వయంగా ప్రకటించారు.

మరో వైపు అసలు ఐఏఎఫ్ ఎయిర్ స్ట్రైక్ లో చెట్లు ధ్వంసం అవడం తప్ప మరేం నష్టం జరగలేదని వార్తలు వేస్తున్న పాక్ మీడియా ఇప్పుడు అదే దాడిలో మసూద్ కు గాయాలై ప్రాణాలు వదిలాడని ప్రసారం చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇది మసూద్ ను కాపాడేందుకు పాక్ పన్నాగమా? లేక నిజంగానే మరణించాడా అనేది తెలియాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.