ఇండియాలో మారణహోమానికి కారకుడైన జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజర్ మరణించాడా? లేక బతికే ఉన్నాడా? అంతర్జాతీయ మీడియాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. తాజాగా మసూద్‌ను ఆర్మీ ఆస్పత్రి నుంచి బహవల్పూర్‌లోని గోథ్ ఘన్ని జైషే శిబిరానికి తరలించినట్లు వస్తున్న కథనాలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. కిడ్నీలు విఫలమై, డయాలసిస్ చికిత్స పొందుతున్నాడని, ప్రస్తుతం ఇల్లు దాటలేని స్థితిలో ఉన్నాడని నాలుగు రోజుల కిందట పాక్ విదేశాంగ మంత్రి అధికారిక ప్రకటన చేశారు. మరోవైపు బాలాకోట్ వైమానిక దాడుల్లో మసూద్ హతమయ్యాడని ఆదివారం ప్రచారం జరిగింది. అయితే, జైషే ప్రతినిధులు దీన్ని కొట్టిపారేశారు. తమ అధినేత బతికేవున్నారని తెలిపారు. ఈ సందిగ్ధం వీడకముందే, ఆర్మీ ఆస్పత్రి నుంచి తరలించినట్లు వార్తలు వచ్చాయి. కాగా, భారత్‌తోపాటు అంతర్జాతీయ ఒత్తిళ్లకు ఇమ్రాన్ సర్కార్ తలొగ్గడంపై జైషే ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మసూద్‌పై నిషేధానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా ఇందుకు సానుకూలంగా ఉన్నాయి. 1267 కమిటీ నిబంధనల మేరకు అతనిపై నిషేధ ఆంక్షలకు రంగం సిద్ధమవుతోంది.
