షాకింగ్ అంటూ సీతక్క పోస్టు: ఒకేసారి 50 క‌రోనా మృతదేహాలకు..

షాకింగ్ అంటూ సీతక్క పోస్టు: ఒకేసారి 50 క‌రోనా మృతదేహాలకు..

హైద‌రాబాద్: రాష్ట్రంలో క‌రోనా కేసుల విష‌యంలో త‌ప్పుడుగా చూపిస్తున్నార‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతుండ‌గా.. తాజాగా ఒకేసారి 50 క‌రోనా డెడ్ బాడీల‌కు ద‌హ‌న సంస్కారాలు చేసిన వీడియో ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఈఎస్ఐ శ్మశాన వాటికలో ఒకేసారి 50 మంది కరోనా పేషెంట్ల మృతదేహాలకు సామూహిక దహన సంస్కారాలు నిర్వహించిన వీడియోపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకే రోజు ఒక్క హైదరాబాద్ ‌లోనే ఇంత మంది చనిపోతే… ప్రభుత్వం మాత్రం ఇంకా లెక్కలు దాచి పెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సామూహిక దహన సంస్కారాలకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ‘షాకింగ్’ అంటూ షేర్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘జూలై 21న రాష్ట్రంలో 7 మంది కరోనాతో చనిపోయినట్లు ప్రభుత్వం చెప్పింది. కానీ ఈఎస్ఐ శ్మశాన వాటికలో అదేరోజు 30కి పైగా మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించారు. కరోనా నియంత్రణలో వైఫల్యం చెందిన ప్రభుత్వం మొదటి నుంచి అసలు లెక్కలను దాచిపెడుతూనే ఉంది. అంటూ విమర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అధికారులు మాత్రం వీరంతా ఒక్క రోజులో చనిపోయిన వాళ్లు కాదని… 3 రోజుల్లో చనిపోయినవారందరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించామని అంటున్నారు.