- రాష్ట్రవ్యాప్తంగా భారీగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు
- కోహెడ మార్కెట్ శంకుస్థాపన.. కిన్నెరసానిలో సఫారీ వాహనాలు, మౌలిక వసతులు
- మీర్ ఆలం బ్రిడ్జ్, రోడ్లు, సోలార్ ప్లాంట్లు, స్పోర్ట్స్ అకాడమీల ప్రారంభం
- మొబైల్ అంగన్‌వాడీలు, టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం.. విద్యార్థులకు కిట్ల పంపిణీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"ను చేపట్టనుంది. జూన్ 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల గృహాల మంజూరు ప్రక్రియ వేగవంతంతో ప్రారంభమయ్యే ఈ ప్రగతి ఉత్సవాలు, జూన్ 12న పాఠశాల విద్యార్థులకు వెల్‌కమ్ కిట్ల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వ్యవసాయ, ఐటీ, రవాణా, పర్యావరణ శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి.
కోహెడ మార్కెట్, పర్యావరణ ప్రాజెక్టులు
జూన్ 3న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌కు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పర్యావరణ దినోత్సవమైన జూన్ 5న ఆర్కూరులో అరణ్య అర్బన్ పార్క్, కిన్నెరసానిలో సఫారీ వాహనాలు ప్రారంభం కానుండగా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో డిజిటల్ గవర్నెన్స్ కోసం 'టీజీపీసీబీ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్' లాంచ్ కానుంది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడిచే 553 ఆర్టీసీ బస్సులు, సౌర విద్యుత్ ప్లాంట్లను ఈనెల 5న ప్రారంభించనున్నారు.
మౌలిక వసతులు, పురపాలక శాఖ అభివృద్ధి
ఈ నెల 7న పురపాలక శాఖ ఆధ్వర్యంలో రూ. 304 కోట్లతో మీర్ ఆలం ట్యాంక్ బ్రిడ్జ్, రూ. 280 కోట్లతో ఉస్మాన్‌సాగర్ తాగునీటి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. వైద్యారోగ్య, విద్య, క్రీడా రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ కార్యాచరణలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. క్రీడా శాఖ ఆధ్వర్యంలో జూన్ 9న 6 క్రీడా అకాడమీల ప్రారంభం, 9 బహుళార్ధసాధక స్టేడియంలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. జూన్ 11న వైద్య శాఖ ఆధ్వర్యంలో టిమ్స్ సనత్‌నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభంతో పాటు, 572 మంది ఆరోగ్య సిబ్బందికి (300 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 272 స్టాఫ్ నర్సులు) నియామక పత్రాలు అందజేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా జూన్ 10న హైదరాబాద్‌లో మొబైల్ అంగన్‌వాడీలు, క్రెచ్‌లు ప్రారంభం కానుండగా, జూన్ 2న 'తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ యాక్ట్' సందర్భంగా సీనియర్ సిటిజన్స్ సమావేశం నిర్వహిస్తారు.
