- రాష్ట్రంలో ఒకేసారి 230 మందికిపైగా ఉద్యోగుల ట్రాన్స్ఫర్
- ఆర్టీఏలుగా ప్రమోషన్ పొందిన వారికి పోస్టింగ్స్
- పలు జిల్లాల డీటీవోలు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఏవోల బదిలీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రవాణా శాఖలో పెద్ద సంఖ్యలో అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 230 మందికిపైగా ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎంవీఐలుగా పనిచేస్తున్న పలువురికి ఆర్టీఏలుగా ప్రమోషన్ కల్పిస్తూ పోస్టింగ్స్ ఇచ్చారు. ఇక జిల్లాల్లో మూడేళ్లకుపైగా పనిచేస్తున్న పలువురు డీటీవోలు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఏవోలను బదిలీ చేసింది. రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ పేరుతో మల్టీ జోన్ –1, 2 పరిధిలోని అధికారుల బదిలీల జాబితా ఆదివారం రాత్రి విడుదలైంది. ఇక మిగితా బదిలీలన్నీ రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి పేరుతో విడుదలయ్యాయి. వికారాబాద్ డీటీవో వెంకట్ రెడ్డి అసిఫాబాద్ కు, పెద్దపల్లి డీటీవో రంగారావు వరంగల్ కు, వెయిటింగ్ లో ఉన్న సంతోష్ కుమార్ కామారెడ్డి డీటీవోగా బదిలీ అయ్యారు.
హైదరాబాద్ ఈస్ట్ జోన్ ఆర్టీఏ కిష్టయ్య హైదరాబాద్ సెంట్రల్ జోన్–1 కు, ఇక్కడ పనిచేస్తున్న పురుషొత్తం రెడ్డి సూర్యాపేట డీటీవోగా, ఇబ్రహీంపట్నం ఆర్టీఏ సుభాష్ చంద్రారెడ్డి వికారాబాద్ డీటీవోగా, మేడ్చల్ మల్కాజిగిరి డీటీవో రఘునందన్ గౌడ్ హైదరాబాద్ ఈస్ట్ జోన్ ఆర్టీఏగా, కొమురంభీం ఆసిఫాబాద్ డీటీవో ఎల్ రాంచందర్ హైదరాబాద్ సౌత్ జోన్ ఆర్టీఏగా బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న రవికుమార్ హైదరాబాద్ సెంట్రల్ జోన్ –2 ఆర్టీఏగా, వెయిటింగ్ లో ఉన్న కొండయ్య నాగోల్ డీటీవోగా, ఎంవీఐ నుంచి ఆర్టీఏగా ప్రమోషన్ పొందిన సురేశ్ బాబు రెడ్డి ఉప్పల్ డీటీవో గా బదిలీ అయ్యారు. మల్టీ జోన్–1, 2 పరిధిలోని ఉద్యోగులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ స్థాయిల్లోని అధికారులు, ఉద్యోగుల బదిలీలు జరిగాయి.
