- ముగ్గురు నిందితుల అరెస్ట్
దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని పడ్మట్ పల్లి క్రాస్ రోడ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా అక్రమ సరుకు పట్టుబడింది. ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కొండమల్లేపల్లి, దేవరకొండ, చందంపేట ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న 18 క్వింటాళ్ల నల్లబెల్లం, 70 కిలోల పటిక, 10 లీటర్ల నాటుసారాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న సంపంగి రాములు, పాత్లావత్ లాలు, ఆంగోత్ తరుణ్‌లపై కేసు నమోదు చేసి, వారి వద్ద నుంచి ఒక బొలెరో వాహనం, రెండు కార్లు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని, నిందితులు ఇప్పటికే పలు కేసుల్లో పట్టుబడిన పాత నేరస్తులని సీఐ పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్సహాయ కమిషనర్ బి. సంతోష్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
