కరోనా దెబ్బకు అన్ని దేశాల జీడీపీ పడిపోతోంది. ఉద్యోగాలు పోతున్నయ్. జీతాలు తగ్గుతున్నయ్. ఈ టైంలో పెరిగింది ఏమన్నా ఉందాని లెక్కగడితే ఇగో సంతానం పెరుగుతోందని ఫిలిప్పీన్స్ అధికారులు అంటున్నారు. ఆసియా దేశాల్లో అత్యధిక జననాల రేటు ఉన్న దేశం ఇది. ఈ సమస్య నుంచి బయటపడాలని ఆ దేశం 1960 నుంచి పాపులేషన్ కంట్రోల్ కోసం ప్లాన్స్ అమలు చేస్తూనే ఉంది. అవి కొంచెం సక్సెస్ కావడంతో బర్త్ రేట్ సగానికి పడిపోయింది. అది పక్క దేశాలతో పోల్చితే ఎక్కువే అనుకోండి! అధికారులు ఆ తగ్గుదల చూసి సంబురపడుతున్నారు. అయితే మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు క్యాథలిక్ చర్చ్ ఫ్యామిలీ ప్లానింగ్‌ని వ్యతిరేకించింది. కానీ, అది పేరెంట్స్ ఇష్టమని ఛాయిస్ ఇచ్చింది. ఇట్ల ఆ దేశంలో సంతానం చుట్టూ రాజకీయాలు, విశ్వాసాలు ఉన్నాయి.
ఇప్పుడు కరోనా వైరస్ ఈ లెక్కల్ని మార్చేసింది. దీని దెబ్బకు ఒక్కసారిగా బర్త్‌రేట్ పెరిగింది. ఆ దేశంలో ఏటా 17 లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. దీనికి అదనంగా వచ్చే ఏడాదికి 2,14,000 మంది పిల్లలు పుడతారని ఆ దేశ ఆరోగ్య శాఖ లెక్కగట్టింది. 1969లో 6.4 శాతంగా ఉన్న బర్త్ రేట్ 2020 నాటికి 2.75కి చేరింది. ఇక వచ్చే సంవత్సరంలో జననాలు 20 శాతం పెరుగుతాయని లెక్కలు చెబుతున్నాయి. అసలే పేదరికం, కరోనా ప్రభావంతో సతమతవుతున్న ఆ దేశం ఈ సంతాన విప్లవంతో మరికొన్ని కష్టాల్లోకి పోతుంది. డెలివరీ కోసం వచ్చే వాళ్లకి బెడ్స్ సరిపోక రెండు బెడ్స్ని కలిపి నలుగురికి ఇస్తున్నారు. ముందు ముందు అంతకంటే ఎక్కువ మందికి ఇవ్వాల్సి వస్తుందని డాక్టర్స్ అంటున్నారు.
