భారీగా పెరిగిన రసాయన ఎరువుల వాడకం

భారీగా పెరిగిన రసాయన ఎరువుల వాడకం

రాష్ట్రంలో ఎకరానికి 177 కిలోల వాడకం
ఇది దేశ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ 
ఇంత ఎక్కువగా వాడితే ముప్పు తప్పదంటున్న నిపుణులు 

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్రంలో రసాయన ఎరువుల వాడకం భారీగా పెరిగింది. ఏపీ, గుజరాత్‌‌లను దాటేసిన తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో పర్యావరణ హితం కోసం ప్రత్యేకంగా అగ్రికల్చర్ పాలసీ అంటూ ఏదీ లేకపోవడంతో ఎరువుల వాడకం బాగా పెరిగింది. ఆర్గానిక్ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం తెచ్చిన పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై)ను కూడా రాష్ట్రంలో సరిగ్గా అమలు కావడం లేదు. దీంతో రాష్ట్రంలో ఏటా 2.70 లక్షల టన్నుల డీఏపీ, 17.50 లక్షల టన్నుల యూరియా, 2.60 టన్నుల ఎం‌‌ఓ‌‌పీ, 13 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు వాడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఎరువులను తగ్గించకపోతే పర్యావరణం దెబ్బతింటుందని ఎక్స్‌‌పర్ట్‌‌లు హెచ్చరిస్తున్నారు. 

దేశ సగటు కంటే 123 కిలోలు ఎక్కువ      

రాష్ట్రంలో ఎరువుల వినియోగం దేశ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఎకరానికి సగటున 53.9 కిలోల ఎరువులు వేస్తుండగా, రాష్ట్రంలో ఎకరానికి సగటున177 కిలోలు వేస్తున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఎకరానికి సగటున 100 కిలోల కంటే ఎక్కువ ఎరువులు వాడుతున్నారు. మరో 6 జిల్లాల్లో ఎకరంలో సగటున 200 కిలోల కంటే ఎక్కువ వేస్తున్నారు. మూడు జిల్లాల్లో 300 కిలోలకన్నా ఎక్కువగానే వినియోగిస్తున్నారు. ఒక జిల్లాలో 500 కిలోల కంటే ఎక్కువ, మరో జిల్లాలో ఏకంగా ఎకరానికి 600 కిలోలకుపైనే వాడుతున్నట్లు వ్యవసాయ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

పురుగుమందులూ ఎక్కువే  

రాష్ట్రవ్యాప్తంగా పంటల్లో కలుపు నివారణతో పాటు చీడపీడల నుంచి పంటలను రక్షించుకునేందుకు పురుగుమందులను కూడా పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. 2014 –-15లో రాష్ట్రంలో 2,806 టన్నుల పురుగుమందదులు వాడగా, ఇప్పుడు దానికి రెండు రెట్లకుపైనే ఉపయోగిస్తున్నారు. 2016 -–17లో3,436 టన్నులు, 2017–-18 లో 4,866 టన్నులు, 2018–19లో 4,894 టన్నులు, 2019–20లో 4,915 టన్నుల పురుగుమందులను లు వినియోగించారు.  

70 శాతం ఎరువులు వేస్ట్  

బీజీ-3 పత్తి సాగులో కలుపును తొలగించడానికి వినియోగించే గ్లైఫోసేట్ మందుతో క్యాన్సర్ ముప్పు ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దీనిపై నిషేధం విధించాయి. అయినా, మన దేశంలో గ్లైఫోసేట్ వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. మన రాష్ట్రంలోనూ ఎక్కడ పడితే అక్కడ ఈ మందు దొరుకుతోంది. మరోవైపు పంటలకు రైతులు వేస్తున్న ఎరువుల్లో 30 శాతమే పంటలకు ఉపయోగపడుతోంది. మిగతా 70 శాతం ఎరువులు నీళ్లలో కొట్టుకుపోవడమో లేదా భూమిలోకి ఇంకడమో జరుగుతోంది. దీనివల్ల మట్టి, నీళ్లు కలుషితం అవుతున్నాయి. 

చర్యలు తీస్కోకుంటే ముప్పు తప్పదు 

రాష్ట్రంలో ఎరువులు, పురుగుమందులు భారీగా వాడుతున్నరు. కంపెనీలు ఇచ్చే డబ్బులకు ఆశపడి సైంటిస్టులు.. డీలర్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి అగ్రికల్చర్‌‌ అధికారులు వీటిని ప్రోత్సహిస్తున్నరు. దీంతో ఎరువుల వాడకం ప్రమాదకర స్థాయికి చేరింది. మట్టి, భూగర్భ జలాలు విషతుల్యం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే భవిష్యత్‌‌లో పెనుముప్పు తప్పదు. 

 - కన్నెగంటి రవి, కన్వీనర్‌‌, రైతు స్వరాజ్య వేదిక