అమ్మాయిల పేరుతో.. అబ్బాయిలపైనా టోపి

అమ్మాయిల పేరుతో.. అబ్బాయిలపైనా టోపి

హైదరాబాద్‌‌, వెలుగు: మ్యాట్రిమోనియల్‌‌ వంశీకృష్ణ (35) బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫేక్ అకౌంట్స్‌‌తో యువతులు, మహిళలను టార్గెట్​చేసి సుమారు రూ.4 కోట్లు అతను మోసం చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అమెరికాలో నివాసముంటున్న యువతిని మొదటగా ఫేక్ ఇన్‌‌స్టగ్రామ్‌‌ అకౌంట్‌‌తో వంశీకృష్ణ మోసం చేశాడు. ఆమె వద్ద రూ.25 లక్షల వసూలు చేశాడు. మోసపోయానని గుర్తించిన బాధితురాలు హైదరాబాద్​సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు గత నెలలో ఫిర్యాదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సంగారెడ్డి జైలులో ఉన్న వంశీకృష్ణను పీటీ వారంట్‌‌పై హైదరాబాద్‌‌ తీసుకొచ్చారు. రెండు రోజులు పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. శుక్రవారం కస్టడీ ముగియడంతో రిమాండ్‌‌కు తరలించారు.

ఏపీలోని రాజమండ్రికి చెందిన వంశీకృష్ణ బీటెక్ పూర్తి చేశాడు. మ్యాట్రిమోని సైట్స్‌‌,ఇన్‌‌స్టగ్రామ్‌‌లో ఫేక్ అకౌంట్లు సృష్టించాడు. బిజినెస్‌‌మెన్, మంత్రులు, ఎమ్మెల్యేలకు దగ్గరి బంధువుగా పరిచయం చేసుకునేవాడు. అమ్మాయిల పేరుతో అబ్బాయిలను కూడా ట్రాప్‌‌ చేశాడు. ఇన్‌‌స్టగ్రామ్‌‌లో అమ్మాయిలను, మ్యాట్రిమోని సైట్స్‌‌లో వితంతువులు, భర్త  నుంచి విడాకులు తీసుకున్న మహిళలను ట్రాప్‌‌ చేసి రూ.4 కోట్లు దోచుకున్నాడు. ఏపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఇతని ట్రాప్‌‌లో చిక్కుకున్నారు. ఇతనిపై రాష్ట్రవ్యాప్తంగా 14కు పైగా కేసులు నమోదయ్యాయి.