బంద్ కు పిలుపునిస్తూ మావోయిస్టుల బ్యానర్లు.. మహారాష్ట్రలో కలకలం

బంద్ కు పిలుపునిస్తూ మావోయిస్టుల బ్యానర్లు.. మహారాష్ట్రలో కలకలం

భద్రాచలం, వెలుగు : మహారాష్ట్రలో మళ్లీ మావోయిస్టుల కలకలం మొదలైంది. గడ్చిరోలి జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు బంద్ పాటించాలంటూ బ్యానర్లు, కరపత్రాలు కనిపించాయి. భూమి, నీరు, గూడు సమస్యల పరిష్కారం పేరుతో గడ్చిరోలి జిల్లా బామ్రాగఢ్​ తాలూకాలోని హిదూర్​-దోబూర్​రహదారిపై ఆదివారం ఈ పోస్టర్లు కనిపించాయి. కాగా, ఇదే జిల్లాలో మావోయిస్టుల పేరుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించే కుట్రను పోలీసులు ఇటీవల భగ్నం చేశారు. ఈ నెల 12న పిప్లీబుర్గి పోలీస్ స్టేషన్​ పరిధిలోని జిజావండి టోలా రహదారిలో మావోయిస్టుల పేరుతో బ్యానర్లు, కరపత్రాలు కనిపించాయి. ఎస్పీ ఎం.రమేశ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి ఛత్తీస్​గఢ్​రాష్ట్రం కాంకేర్​జిల్లా పకాంజూర్​ పోలీస్​స్టేషన్​పరిధిలోని తరుణ్​నగర్​కు చెందిన శివ అనిల్​మిస్త్రీ, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తాలూకా వటేలీ గ్రామానికి చెందిన రోహిత్​ రంజిత్​మల్లిక్​ను శనివారం అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్​కు చెందిన వారే ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు కుట్రలు చేస్తున్నారని మహారాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు.