- మన దేశంలోనూ నిప్పులు చెరిగిన భానుడు
- ప్రపంచ సగటు ఉపరితల ఉష్ణోగ్రత 15.79 డిగ్రీలకు చేరిక
- పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి కంటే 1.4 డిగ్రీలు ఎక్కువ
న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెల గడిచిన 176 ఏండ్ల(1850 నుంచి) ప్రపంచ వాతావరణ చరిత్రలోనే రెండో అత్యంత ఉష్ణోగ్రతలు నమోదు చేసిన నెలగా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల సగటున 1.4 డిగ్రీలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే, మనదేశం కూడా గత మే నెలలో మునుపెన్నడూ లేనంత అత్యంత తీవ్రమైన ఎండలతో భగ్గున మండింది.
నైరుతి రుతుపవనాలు(జూన్ 4న) రాకముందు.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వడగాల్పుల ధాటికి అల్లాడిపోయారు. ముఖ్యంగా రాజస్తాన్ రాష్ట్రం భారీ ఉష్ణోగ్రతల నమోదుకు కేంద్రబిందువుగా మారింది. మే 27న అక్కడి శ్రీ గంగనగర్‌లో అత్యధికంగా 48.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అలాగే, చురు ఏరియాలో 48 డిగ్రీలు దాటగా, పశ్చిమ రాజస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పదేపదే 46 నుంచి 48 డిగ్రీల వరకు నమోదయ్యాయి.
ఈ తీవ్రమైన ఎండలు కేవలం రాజస్తాన్‌కే పరిమితం కాకుండా పంజాబ్, హర్యానా, ఢిల్లీ వంటి వాయువ్య భారత ప్రాంతాలకూ విస్తరించాయి. అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోవడంతో పాటు.. తీవ్ర వేడి, పొడి గాలులు జనాన్ని ఇండ్లకే పరిమితం చేశాయి. కేవలం పగలే కా కుండా, ఉత్తర, మధ్య భారత ప్రాంతాలలో రాత్రి వేళల్లో కూడా అసాధారణమైన టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. సాధారణంగా రాత్రి పూట శరీరం వేడి నుంచి కోలుకుంటుంది. కానీ సూర్యాస్తమయం తర్వాత కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.
వాతావరణ మార్పులే ప్రధాన కారణం
మనదేశాన్ని వణికించిన ఈ ఎండల వెనుక ప్రపంచవ్యాప్తంగా సంభవించిన వాతావరణ మార్పులే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ వోఏఏ) నివేదిక ప్రకారం..1850 నుంచి అందుబాటులో ఉన్న గత 176 ఏండ్ల ప్రపంచ వాతావరణ గణాంకాలను పరిశీలిస్తే అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన రెండో నెలగా ఈ ఏడాది మే నెల రికార్డు క్రియేట్ చేసింది. ఈ నెలలో ప్రపంచ సగటు ఉపరితల గాలి ఉష్ణోగ్రత 15.79 డిగ్రీలకు చేరుకుంది.
