- ఎన్నికల గైడ్‌లైన్స్ విడుదల
- చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
- విప్ ధిక్కరిస్తే వేటు తప్పదన్న ఎలక్షన్ కమిషన్
- ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
హైదరాబాద్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేయర్, చైర్‌పర్సన్ నియామకం కోసం జరిగే ఎన్నికల్లో.. పార్టీలకు సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్, 116 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, డిప్యూటీ చైర్‌పర్సన్ నియామకానికి ఈ నెల 16న పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు, 12 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 2,982 స్థానాల కోసం ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా.. మొత్తం 12,930 మంది బరిలో ఉన్నారు. 13న కౌంటింగ్ జరుగనుండగా.. రిజల్ట్ అనంతరం గెలుపు పత్రాలు అందించడంతో రిటర్నింగ్ ఆఫీసర్ల డ్యూటీ ముగుస్తుంది. ఆ తర్వాత కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పాలకవర్గాల నియామకం కోసం గెజిటెడ్ ఆఫీసర్లను ఎన్నికల అధికారులుగా నియమించనున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గెలిచిన క్యాండిడేట్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు 16న నిర్వహించే ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలంటూ 14న గెజిట్ విడుదల చేయనున్నారు.
14 లోపు ఎక్స్ అఫీషియో సభ్యుల ఫైనల్
తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మాత్రమే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు పోటీ చేయాలి. వీరి ఎన్నికలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంటుంది.
ఈ పేర్లను ఈ నెల 14 లోపు ఆయా జిల్లాల కలెక్టర్లు ఫైనల్ చేయనున్నారు. ప్రతి సభ్యుడికి ఒక్క ఓటు మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రెండు సార్లు చేయి ఎత్తి ఓటింగ్‌లో పాల్గొంటే... రెండో దానిని పరిగణనలోకి తీసుకోరు. ఒకవేళ పోటీలో ఉన్న అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ తీయనున్నారు. ఇందులో భాగంగా పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను కాగితాలపై ఐదు చొప్పున రాసి, మొత్తం 10 చిట్టీలను కలిపి లాటరీ తీయనున్నారు. మొదట స్లిప్‌లో ఎవరి పేరు వస్తే వారినే విజేతగా ప్రకటించనున్నారు.
విప్ ధిక్కరిస్తే సభ్యత్వం ఊస్ట్
మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నికల కోసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు విప్ జారీ చేసే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ‘చేతులెత్తే పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో విప్ పాటించడం ఆయా పార్టీల సభ్యులకు తప్పనిసరి. విప్‌ను ఉల్లంఘించి ఓటు వేసినా, ఓటింగ్‌కు దూరంగా ఉన్నా వారు సభ్యత్వాన్ని కోల్పోతారు’ అంటూ ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది.
‘రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీలకే విప్ జారీ చేసే హక్కు ఉండనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శికి మాత్రమే విప్ పర్యవేక్షణ అధికారాల కోసం మరొకరిని నియమించే అధికారం ఉంటుంది. విప్‌గా నియమితులైన వారు తమ పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తూ సమావేశం ప్రారంభానికి గంట ముందుగానే ఎన్నికల అధికారికి ఫారం-–బీని అందచేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులంతా విప్ ప్రకారమే ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎవరైనా సభ్యుడు విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా దానిని పరిగణనలోకి తీసుకుంటారు కానీ.. అతడు సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఎన్నికల పరిశీలకులు స్పష్టం చేశారు.
పటిష్ట భద్రత నడుమ..
ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికలు జరుగనున్న 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పోలీస్ శాఖను ఆదేశించారు. గెలిచిన సభ్యులను క్యాంప్‌లకు తరలించడం, రహస్య ప్రాంతాల్లో నిర్బంధించడం వంటి వాటిని అడ్డుకోవాలని సూచించారు. ఇలాంటి ఫిర్యాదులు ఏమైనా వస్తే వెంటనే స్పందించి సభ్యులను విడుదల చేయించాలని సూచించారు.
గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎలాంటి భయభ్రాంతులకు, బెదిరింపులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. ‘పరోక్ష ఎన్నికలు చట్టబద్దంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల ప్రక్రియను మొత్తం వీడియో తీయాలి.. అవసరమైతే కలెక్టర్ల అనుమతితో లైవ్ టెలికాస్ట్ చేయడానికి అనుమతివ్వాలి’ అంటూ మార్గదర్శకాలు జారీ చేశారు.
