కండువా మారగానే.. ఆర్ఎస్ ప్రవీణ్ మాట మారింది : ఎంపీ రఘునందన్రావు

కండువా మారగానే.. ఆర్ఎస్ ప్రవీణ్ మాట మారింది :  ఎంపీ రఘునందన్రావు

కాగజ్ నగర్, వెలుగు: తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గగ్గోలు పెట్టిన ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​.. ఇప్పుడు కండువా మారగానే ఫోన్ ట్యాపింగ్ అసలు తప్పే కాదంటూ మాట మార్చడం విడ్డూరంగా ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సోమవారం కాగ జ్ నగర్ లో ఆయన మున్సిపల్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎస్పీఎం కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్​పై పదేపదే విమర్శలు చేసిన ప్రవీణ్​కుమార్​.. సిర్పూర్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన తరువాత బీఆర్​ఎస్​లో చేరారన్నారు. కండువా మారగానే ఫోన్​ ట్యాపింగ్ ఒప్పు అయిందా అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో బహిరంగ చర్చకు బీఆర్​ఎస్​ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే హరీశ్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, జిల్లా ఎన్నికల ప్రబారీ భూమయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.