మెదక్ టౌన్, వెలుగు: వేర్వేరు పోక్సో కేసుల్లో ఇద్దరికి 20 ఏండ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ మెదక్ పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన చాకలి ప్రవీణ్(21) అదే ప్రాంతానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలిక(17)ను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బాలిక మేనత్త గమనించి ఆమెను ప్రశ్నించగా ప్రవీణ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హవేళీ ఘనపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంతో నేరం రుజువు కాగా.. కోర్టు 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధించింది.
మరో కేసులో పెద్దశంకరంపేట పీఎస్ పరిధిలోని కోళ్లపల్లి గ్రామానికి చెందిన బేగరి బెత్తయ్య(25) ఆటో నడిపేవాడు. ఇతని ఆటోలో 9వ తరగతి బాలిక మోడల్ స్కూల్‌కు వెళ్లేది. ఆమెతో పరిచయం పెంచుకున్న బెత్తయ్య 2021లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లింగంపల్లికి తీసుకెళ్లి అద్దె గదిలో ఉంచాడు. అనంతరం మరుసటి రోజు ఉద్యోగం చూసుకొని వస్తానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కోర్టులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడంతో కేసును విచారించిన పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి ఆర్.ఎం.శుభవల్లి నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు.
ఐదేండ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో 25 ఏండ్ల జైలు
సిద్దిపేట రూరల్, వెలుగు: ఐదేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 25 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ విధిస్తూ సిద్దిపేట పోక్సో కోర్టు తీర్పు చెప్పినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 2021 ఏప్రిల్ 22న గొర్ల రవికుమార్ (57) .. ఐదేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో పోక్సో కేసు నమోదైంది. కేసును అప్పటి అడిషనల్ డీసీపీ రామేశ్వర్, సీఐ బి.శ్రీనివాస్ సమగ్ర దర్యాప్తు చేసి, పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం జడ్జి వై.జయ ప్రసాద్ నిందితుడికి 25 ఏండ్ల జైలు శిక్షతోపాటు, రూ.10వేల జరిమానా విధించారు.
