మెదక్, వెలుగు: అగర్వాల్ స్టీల్ కంపెనీ విస్తరణకుఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వొద్దని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చి ధర్నా నిర్వహించారు. పోలీసుల మెయిన్ గేటు మూసేయడంతో ప్లకార్డులు పట్టుకొని గేటు వద్దే బైఠాయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీ కాలుష్యం పెరిగిందని, దీనివల్ల శరీరంపై దద్దుర్లు వస్తున్నాయని, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇపుడున్న ఫ్యాక్టరీ వల్లే ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయంటే, విస్తరిస్తే ఇంకా పెరుగుతాయన్నారు. ఇటీవల భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారులు గ్రామాలకు వచ్చి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ధర్నాకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ విస్తరణ సరికాదన్నారు. అనంతరం డీఆర్‌వో అంబదాస్ రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు.
