వరంగల్: మేడారం సమ్మక్కసారలమ్మ జాతర హుండీలను గురువారం నుంచి లెక్కించనున్నారు. ఇందుకోసం ఎండోమెంట్ ఆఫీసర్లు హుండీలను మంగళవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ జంక్షన్‍లోని టీటీడీ ఫంక్షన్ హాల్ కు చేర్చారు. 2024 జాతర సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 760 హుండీలు ఏర్పాటు చేయగా, ఈసారి 788 ఏర్పాటు చేశారు. వీటితో పాటు ముడుపులు సమర్పించేందుకు 45 క్లాత్ హుండీలు, మరో 3 ఒడి బియ్యం హుండీలను అందుబాటులో ఉంచారు.
హుండీల లెక్కింపును వారంలోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన 170 మంది సిబ్బందిని నియమించారు. వీరికితోడు గతంలో జాతరలో కానుకలు లెక్కించిన అనుభవం కలిగిన 150 మంది స్వచ్ఛంద సంస్థల సభ్యుల సేవలను వాడుకోవాలని భావిస్తున్నారు. కౌంటింగ్ ఏరియాలో 20 సీసీ కెమెరాలు బిగించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లెక్కింపు చేపట్టనున్నారు.
